యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమా శుక్రవారం రోజు విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రతిరోజూ పండగ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మారుతి పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈరోజు ప్రతిరోజు పండగే చిత్ర బృందం థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. మీడియా ముఖంగా మారుతి 2003 సంవత్సరంలో అల్లరి నరేష్, సదా కాంబినేషన్ లో తెరకెక్కిన ప్రాణం సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
అల్లరి నరేష్, సదా జంటగా మల్లి దర్శకత్వంలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ప్రాణం సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. సినిమాలోని పాటలు హిట్టైనా సినిమా కమర్షియల్ గా నిర్మాతకు నష్టాలనే మిగిల్చింది. ఈ సినిమాను మాగంటి బాబు అనే నిర్మాత నిర్మించాడు. ఈ సినిమా చాలా మందికి నిద్ర లేని రాత్రుల్ని మిగిల్చిందని మారుతి చెప్పారు. సినిమా డిస్ట్రిబ్యూటర్ గా మారుతి తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. 
 
ప్రాణం సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మారుతి కొనుక్కున్నారు. ఆ సినిమాకు భారీ నష్టాలు వచ్చాయని ప్రాణం సినిమా తన ప్రాణం తీసినంత పని చేసిందని అన్నారు. ప్రాణం సినిమా కారణంగా తాను తీవ్రంగా నష్టపోయానని ఇండస్ట్రీకి దూరం కావాలని అనుకున్నానని మారుతి చెప్పారు. ఆ తరువాత బన్నీవాసు సూచనలతో సుకుమార్ తొలి సినిమా ఆర్య హక్కులను మారుతి కొన్నారు. 
 
ఆ సినిమాకు భారీ లాభాలు వచ్చాయని మారుతి చెప్పారు. ఇండస్ట్రీలో తాను ఈ స్థాయిలో ఉండటానికి ఒక రకంగా సుకుమార్ కారణమని మారుతి వ్యాఖ్యలు చేశారు. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్య హక్కులు కొన్నానని తన భార్య దగ్గరనుండి ఆ డబ్బులను తీసుకున్నానని చెప్పారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజు పండగే మూవీ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: