చిరంజీవి పవన్ కళ్యాణ్ ల రాజకీయ మార్గాలు వేరైనా గమ్యం ఒకటే అంటూ స్వయంగా చిరంజీవి ఓపెన్ గా అనేకసార్లు చెప్పాడు. ‘ప్రజారాజ్యం’ ప్రమోగం వికటించి ఆతరువాత కాంగ్రెస్ లో చేరిపోయిన చిరంజీవి ఎన్నికలలో కాంగ్రెస్ ఘోరపరాజయం చెందిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం తన సినిమా విషయాలు మాత్రమే చూసుకుంటూ వస్తున్నాడు. 

అలాంటి పరిస్థితులలో చిరంజీవి కొంతకాలం క్రితం జగన్ ను వ్యక్తిగతంగా కలవడం ఆతరువాత లేటెస్ట్ గా జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకటన ఇవ్వడమే కాకుండా తన మద్దతును ఒక ఆడియో క్లిపింగ్ ద్వారా తెలియచేయడం మెగా అభిమానులకు కూడ అర్ధంకాని విషయంగా మారింది. పవన్ ఒకవైపు జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తుంటే చిరంజీవి జగన్ నిర్ణయాలకు మద్దతు తెలుపుతూ ఉండటంతో జనసైనికులు కూడ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు సమాచారం. 

వాస్తవానికి చిరంజీవి ఇచ్చిన ప్రకటన పై పవన్ తన అభిప్రాయాన్ని తెలుపుతాడని చాలామంది భావించారు. అయితే పవన్ చిరంజీవి ప్రకటన తన దృష్టిలోకే రానట్లుగా ప్రవర్తిస్తూ తన మౌనాన్ని కొనసాగిస్తున్నాడు. దీనితో పవన్ మౌనం వెనుక వ్యూహాత్మక రహస్యాలు ఉన్నాయా అంటూ ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి చిరంజీవికి ఎప్పటి నుండో వైజాగ్ లో ఒక భారీ స్టూడియో కట్టాలని అనేకమందితో చర్చలు జరుపుతున్నారు. 

ఇప్పుడు జగన్ నోటి వెంట విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మారబోతున్నట్లుగా వస్తున్న లీకులను ఆసరాగా చేసుకుని తిరిగి అన్నీ అనుకూలిస్తే ప్రభుత్వం నుండి భూములు తీసుకుని ఒక భారీ స్టూడియో వైజాగ్ లో కట్టాలి అన్న ప్రయత్నాలు మళ్ళీ చిరంజీవి మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాలు పూర్తిగా పవన్ కు తెలుసు కాబట్టే చిరంజీవి ప్రకటనకు పవన్ ఖండన ఇవ్వకుండా తన వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నాడు అంటూ కొందరు పవన్ మౌనం పై కొత్త విశ్లేషణలు చేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: