హైదరాబాద్ లోని ప్రముఖ దర్శకులు, నిర్మాతల ఇళ్లల్లో, ఆఫీసుల్లో  జీఎస్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఒకే సమయంలో 15 మంది దర్శక నిర్మాతల ఇళ్లల్లో, ఆఫీసుల్లో సోదాలు జరుగుతూ ఉండటం గమనార్హం. సినీ ప్రముఖులతో పాటు బిల్డర్స్, స్టీల్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారుల ఇళ్లలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. తప్పుడు పత్రాలతో జీఎస్టీ ఎగ్గొట్టారనే ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. 
 
గత వారం పది రోజుల నుండి సినీ పరిశ్రమలోని ప్రముఖులపై జీఎస్టీ దాడులు జరుగుతున్నాయి. కొన్ని సినీ నిర్మాణ సంస్థలపై, ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి ఆఫీస్ పై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం నుండి హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ కార్యాలయంపై ఏక కాలంలో దాడులు చేశారని సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ కార్యాలయాలపై కూడా సోదాలు జరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 
 
ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ ఇంటిపై, ఆఫీసుల్లో కూడా జీఎస్టీ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇతర సినీ ప్రముఖులపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ఆదాయం తక్కువ చూపించి టాక్స్ ఎగ్గొట్టారనే అభియోగాలు వస్తూ ఉండటంతో అధికారులు దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది ఇళ్లపై, ఆఫీసుల్లో  రేపు, ఎల్లుండి కూడా దాడులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 
 
జీఎస్టీ అధికారుల దాడులు టాలీవుడ్ ప్రముఖులే లక్ష్యంగా కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఆదాయాన్ని దర్శక నిర్మాతలు తక్కువగా చూపిస్తున్నారని దర్శక నిర్మాతలు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులను ఎగ్గొట్టారనే ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు చేస్తున్నారు. మరోవైపు వైజాగ్ లో కూడా జీఎస్టీ అధికారుల సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నిన్న జీఎస్టీ అధికారులు చేసిన దాడుల్లో 12 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేతలను గుర్తించినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: