తమిళ సినిమా పరిశ్రమకు ఆ రాష్ట్ర థియేటర్ యజమానుల సంఘం మరో భారీ షాక్ ఇవ్వనున్నట్లు కనిపిస్తుంది. గతంలో విడుదలైన సినిమాలు డిజిటల్ విభాగాల్లో విడుదలని ఆలస్యం చేయాలని దాదాపు 45 రోజుల పాటు సమ్మె చేశారు థియేటర్ యజమానులు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారిపై విధిస్తున్న వినోద పన్ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని థియేటర్లపై 8 శాతం వినోదపు పన్ను వసూలు చేస్తున్నారు. దీని వల్ల తామెంతో నష్టపోతున్నామని థియేటర్ యజమానులు వాపోతున్నారు. అలాగే వారి తాజా డిమాండ్లలో ఏ పెద్ద హీరో చిత్రం అయినా భారీగా నష్టపోతే ఆ చిత్రం నటీనటులే నష్టాన్ని భరించాలని అంటున్నారు. అంతేకాకుండా థియేటర్లలో విడుదలయ్యే సినిమాను 100 రోజుల తర్వాతనే డిజిటల్ విభాగాలలో విడుదల చేయాలని మరోసారి తెరపైకి తీసుకుని వచ్చారు.

 

 తాజాగా కార్తీ నటించిన ఖైదీ సినిమా థియేటర్లలో ఆడుతున్న కూడా హాట్స్టార్ యాప్ లో సినిమాను పెట్టడం ద్వారా తమ ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని థియేటర్ యాజమాన్యం బాధ పడ్డారు.అలాగే హీరో ధనుష్ నటించిన అసురన్ సినిమా కూడా థియేటర్ లో ఆడుతున్నప్పుడే డిజిటల్ మీడియా లో విడుదల చేశారు నిర్మాతలు. దీని వల్ల వారికి చాలా నష్టం వచ్చింది అని చెప్పారు.

 

 ఇక ఇలా కాకుండా తమ నిర్ణయాన్ని కాదంటూ డిజిటల్ మీడియా లో సినిమాను విడుదల చేస్తే ఆ సినిమా నిర్మాత అలాగే హీరో సినిమాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్లను గురించి  ప్రభుత్వం అంగీకరించకపోతే వచ్చే మార్చి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లో అన్నీ మూసి వేస్తామని తమిళ థియేటర్ యజమానులు సంఘం ప్రకటించింది. మరి ఈ వివాదం పై కోలీవుడ్ ప్రముఖులు ఏ విధంగా స్పందించి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: