భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. 1885లొ డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ పార్టీ ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికైంది. 135 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు రధసారధులెందరో మారారు.. అధికారం చేపట్టాక ఎందరో ప్రధానమంత్రులయ్యారు. ఎంతో ఘనకీర్తి కలిగిన కాంగ్రెస్ కు ఈమధ్య కలిసిరావటం లేదు. ఉనికి కోల్పోయే ప్రమాదం లేకపోయినా తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతోంది. ఇందుకు కారణాలను వెదికితే స్వయంకృతాపరాధాలే ఎక్కువ. 

 

 

ప్రస్తుతం కాంగ్రెస్ కు జాతీయస్థాయిలో నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. వయసురీత్యా సోనియా గాంధీ తనయుడు రాహుల్ కు పగ్గాలు అప్పజెప్పినా గత ఎన్నికల్లో మోదీ ముందు తేలిపోక తప్పలేదు. రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రాక కూడా ఆలస్యమవడంతో కలిసికట్టుగా ప్రయాణించి కాంగ్రెస్ ను గట్టెక్కించే అవకాశం లేకపోయింది. ముఖ్యంగా యువ నాయకత్వ పోకడలు కాంగ్రెస్ లో లేకపోయింది. బీజేపీలో యువ నాయకత్వం లేకపోయినా పదునైన ఆలోచనలతో ముందుకుకెళ్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో జరిగిన కుంభకోణాలు కూడా కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లేలా చేశాయి.తెలుగు రాష్ట్రాల్లో కూడా విధానపరమైన నిర్ణయాలతో కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడిపోయింది.

 

 

తెలంగాణలో కాస్త ఉనికి ఉన్నా ఏపీలో పూర్తిగా కాంగ్రెస్ కనుమరుగైపోయింది. మేమున్నాం.. అని కాంగ్రెస్ లో మిగిలిపోయిన నాయకులు చెప్పుకోవడం తప్పితే ప్రజల్లో గత ప్రాభవం చూపలేకపోతోంది. రాష్ట్ర విభజన కాంగ్రెస్ ను పాతాళంలోకి నెట్టేసిందనే చెప్పాలి. ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాటాలు చేస్తున్నా ఎటువంటి ఇంపాక్ట్ చూపలేకపోవడం.. రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితిని తెలియజేస్తోంది. తెలంగాణలో ఉన్న నాయకులు గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారనే చెప్పాలి. మొత్తానికి.. దేశంలోనే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ మరింత పుంజుకోవాల్సిన అవసరముంది. ఇందుకు నాయకత్వంలో, నాయకుల్లో గణనీయమైన మార్పులు రావడం తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: