తెలుగులో ఉన్న కమెడియన్లు మరే ఇండస్ట్రీలోనూ లేరేమో! పదుల సంఖ్యలో కమెడియన్లు ఉన్నా కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే ఒకప్పుడు వచ్చినంత కామెడీ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో లేకపోవడం వల్ల కమెడియన్లకి ఎక్కువ పేరు రావడం లేదు. ఇంతకుముందు కథతో పాటు కామెడీ ట్రాకులు సెపరేట్ గా ఉండేవి. అవి కేవలం కమెడియన్ల కోసమే రాయడం వల్ల వారికి చాలా పేరొచ్చేది.

 

ఇప్పుడు కథలోనే కామెడీ చేయాలని చుస్తున్నారు. కథతో పాటు నడిచే సన్నివేశాలనే కామెడీగా తీర్చిదిద్దుతున్నారు. అందువల్ల కమెడియన్లకి ఎక్కువ స్కోప్ లేకుండా పోతుంది. ఈమధ్య వచ్చిన చాలా సినిమాల్లో కామెడీ ఉన్నప్పటికీ ఏ ఒక్క కమెడియన్ కి కూడా అంతగా పేరు రాలేదు. అయితే ఇటీవల ఒక కమెడియన్ కి మాత్రం విపరీతమైన పేరొచ్చింది. సినిమా మొత్తం ఆ కమెడియన్ మీదనే నడుస్తుందంటే అతనికి వచ్చిన గుర్తింపు ఏంతనేది అర్థం చేసుకోవచ్చు.

 

రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన మత్తు వదలారా చిత్రంలో కమెడియన్ సత్యకి ఫుల్ లెంగ్త్ పాత్ర దక్కింది. ఆ సినిమాలో హీరోగా నటించిన సింహా పాత్రతో పాటు నడిచే ఈ పాత్ర సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఉంది. తనదైన పంచులతో, కామెడీ టైమింగుతో సినిమా మొత్తం నవ్వులు పూయించాడు. రీ ఇంట్రడ్యూస్ అంటూ టైటిల్స్ లో నేమ్ కార్డ్ పడటం నుండే స్టార్ట్ అయిన కామెడీ సినిమా చివరి వరకు కొనసాగింది.

 

ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల గిలిగింతలు పెట్టించడంతో పాటు ఒక థ్రిల్లింగ్ అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమాలో సత్య పేరుకి కమెడియన్ అయినా హీరోలా సినిమా మొత్తం తానే కనబడ్డాడు. అంతే కాదు సినిమా పూర్తయ్యాక ఈ పాత్రే ఎక్కువగా గుర్తుంటుంది. ఇటీవల ఇంత పేరు సంపాదించిన కమెడియన్ సత్యే అయ్యుంటుంది. మొత్తానికి ఇక నుండి సత్యకి వరుస ఆఫర్లు దక్కినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: