ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జనసేన నాయకులతో జనసైనికులతో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల ప్రతిపాదన పై చర్చలు జరపడమే కాకుండా అమరావతి రైతుల ఆందోళన విషయంలో తాను ఎలాంటి మద్దతు తెలపాలి అన్న కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి పవన్ తన అత్తవారి దేశం రష్యా నుండి జనవరి 1 తరువాత వస్తాడని భావించారు.

అయితే పవన్ తన టూర్ ను కట్ చేసుకుని ఇప్పుడు హడావిడిగా తిరిగి రావడమే కాకుండా ఈరోజు ఒక కీలక భేటీ నిర్వహిస్తున్న నేపధ్యంలో పవన్ ఈ సాయంత్రానికి ఎదో ఒక కీలక ప్రకటన చేస్తాడు అన్న ఊహాగానాలు మొదలు అయ్యాయి. ప్రస్తుతం మూడు రాజధానుల విషయంలో ఒక స్పష్టమైన క్లారిటీ తాను ఇవ్వకపోతే తన ఇమేజ్ మరింత తగ్గి పోతుంది అన్న భావనతో పవన్ ఈ వ్యూహం అనుసరిస్తున్నాడు అని అంటున్నారు. 

గతంలో రాజధాని ప్రాంతంలో రైతుల నుండి బలవంతంగా భూములు సేకరిస్తే వారికి అండగా ఉంటానని పవన్ అప్పట్లోనే రాజధాని గ్రామాల్లో పర్యటించి హామీ ఇచ్చాడు. అదే రైతులు ఇప్పుడు ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు కాబట్టి పవన్ తీసుకోబోయే కీలక నిర్ణయంతో అధికార పార్టీ మరింత ఇరుకున పడేలా పరిస్థితులు ఏర్పడవచ్చు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.  

అయితే తాను అన్ని ప్రాంతాలను డెవలప్ చేయటానికి వ్యతిరేకం కాదని అయితే పాలన వికేంద్రీకరణ మాత్రం సరైన విధానం కాదని ఇప్పటికే పవన్ అనేకసార్లు చెప్పిన నేపధ్యంలో తనకు ఎంతో పట్టు ఉన్న ఉత్తరంద్ర ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా పవన్ ఎలా తెలివిగా వ్యవహరిస్తాడు అన్న విషయమై అన్ని వర్గాలలోను ఆసక్తి నెలకొని ఉంది. దీనికితోడు కొద్ది రోజులుగా అధికార పార్టీకి..ముఖ్యమంత్రి మద్దతుగా తన వాయిస్ వినిపిస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఈ సమావేశానికి రప్పించేలా పవన్ తన పట్టును ప్రదర్శించ గలడా లేదా అన్న విషయమై పవన్ పొలిటికల్ స్టామినా నిర్దారింప బడుతుంది..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: