ప్రతి ఏడాది టాలీవుడ్‌లో చిన్న, పెద్ద చిత్రాలన్నీ  కలిపితే దాదాపు 200 సినిమాలకు పైగా విడుదలవుతుంటాయి. ఇక ఎప్పటిలానే ఈ 2019 సంవత్సరంలో కూడా చాలా సినిమాలు విడుదల అయ్యాయి. కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లు కాగా.. మరికొన్ని ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. ఇంకొన్నిచిత్రాలయితే క‌థ క‌థ‌నాలు ప‌రంగా ఈ మూడు చిత్రాల‌కి చాలా మంచి పేరు వ‌చ్చింది. ఇందులో కొన్ని క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా హిట్ అయ్యాయి. మ‌ల్లేశం చిత్రం ఒక క్లాసిక్ మూవీ అనే చెప్పాలి. 

 

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ…

నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. డిటెక్టీవ్, మర్డర్ మిస్టరీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 2019లో చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద బ్లాక్‌బస్టర్‌గా మారింది.

 


జార్జ్ రెడ్డి…

‘జార్జ్ రెడ్డి’… ఇండియన్ చేగువేరా అని చెప్పాలి. ధైర్యం, సాహసానికి ప్రతీకగా ఈ పేరు నిలుస్తుంది. 1967లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలకు బీజం వేసిన జార్జ్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడి జీవిత కథ ఆధారంగా జార్జ్ రెడ్డి సినిమాను తెరకెక్కించారు. యూనివర్సిటీలో చదువుతూ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జ్ రెడ్డిని చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్ధులు క్యాంపస్‌లోనే హత్య చేశారు. 1965-75 మధ్య ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ప్రతీ విద్యార్థికి జార్జ్ జీవితం గురించి తెలుసు. అలాంటి టెరిఫిక్ లీడర్ జీవితకథను ఈ తరానికి తెలిసే విధంగా ఈ మూవీను రూపొందించారు. కలెక్షన్స్ పరంగా నిరాశపరిచినా.. ఈ సినిమాను విమర్శకులు, ప్రేక్షకులు మంచి సినిమాగా పట్టం కట్టారని చెప్పాలి.

 


మ‌ల్లేశం...

పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేత కార్మికుల కోసం ఆసు యంత్రాన్ని క‌నుగొన్న చింత‌కింది మ‌ల్లేశం జీవిత‌క‌థే ‘మ‌ల్లేశం’ చిత్రం. మల్లేశం పాత్రలో ‘పెళ్లి చూపులు’ ఫేమ్ ప్రియదర్శన్ నటించారు. ఒక చీరకు ఆసు పోయాలంటే దారాన్ని పిన్నుల చుట్టూ 9 వేల సార్లు అటూ ఇటూ తిప్పాలి. ఆ రకంగా రోజుకి 18 వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే రెండు చీరలను మాత్రమే నేయగలరు. రోజుకు రెండు చీరెలు నేస్తేనే కార్మికుడికి గిట్టుబాటు అవుతుంది. దారాన్ని కండెల చుట్టూ తిప్పడానికి మల్లేశం తల్లి లక్ష్మి చాలా కష్టపడేవారు. చేతులు, భుజం నొప్పితో బాధపడేవారు. తల్లి వేదన చూడలేకపోయిన మల్లేశం.. హైదరాబాద్ వచ్చి ఏడేళ్లపాటు శ్రమించి ఆసు యంత్రానికి రూపకల్పన చేశారు. ఈ నేపథ్య కథతో హృద్యంగా ‘మల్లేశం’ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం ఒక పెద్ద క్లాసిక్‌గా 2019 చిత్రాల్లో మిగిలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: