తెలుగు ఇండ‌క‌స్ట్రీలో గ‌త సంవత్స‌రం 190 చిత్రాలు విడుద‌ల‌య్యాయి. అందులో కేవ‌లం ఇర‌వై సినిమాలు మాత్ర‌మే హిట్ అయ్యాయి. మిగ‌తా వంద చిత్రాలు ఆశించినంత హిట్ టాక్ రాలేదు. దాదాపుగా చాలా మంది నిర్మాత‌లు న‌ష్ట‌పోయారు. అయితే అందులో కొంద‌రు మాత్రం త‌ట్టుకుని నిల‌బ‌డ్డారు. ఇండ‌స్ట్రీకి కొత్త‌గా వ‌చ్చిన నిర్మాత‌ల‌కు మాత్రం ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌లేదు.  న‌మ్ముకున్న స్టార్ హీరోలు ముంచేశారు. ఫార్ములా ప‌ట్టుకుని వేలాడిన ద‌ర్శ‌కులు డీలా ప‌డిపోయారు. అయితే ఇదంతా గ‌తం. ఇప్పుడు కావ‌ల్సింది కొంత ఆశ‌. కొండంత ఆశ‌యం. అవి ఉంటే 2020లో అద్భుతాలు సృష్టించొచ్చు. ఆ అవ‌కాశాలూ పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. 

 

2020లో ప్రేక్ష‌కుల్ని, టాలీవుడ్‌ని ఆశ‌ల ప‌ల్ల‌కిలో ఊరేగిస్తున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ సంక్రాంతికి వ‌స్తున్న అన్ని సినిమాల పైనా చాలా ఆశ‌లు పెట్టుకున్నారు ఇటు ప్రేక్ష‌కులు అటు నిర్మాత‌లు.  ముఖ్యంగా ఇద్ద‌రు పెద్ద హీరోల చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఒక‌టి స‌రిలేరు నీకెవ్వ‌రు, అల‌.. వైకుంఠ‌పుర‌ములో ప్రేక్ష‌కుల దృష్టిని విప‌రీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రెండు సినిమాల బిజినెస్ ర‌మార‌మీ 300 కోట్ల వ‌ర‌కూ ఉండొచ్చు. వీటిలో ఏ ఒక్క హిట్టు త‌గిలినా 2020కి బంప‌ర్ ఓపెనింగ్ రావ‌డం ఖాయం. ఇక ద‌ర్బార్‌, ఎంత మంచి వాడ‌వురా కూడా హిట్టు ల‌క్ష‌ణాల‌తోనే వ‌స్తున్నాయి. ర‌జ‌నీ – మురుగ‌దాస్ కాంబినేష‌న్ అంటేనే ‘ఒక్క‌సారి ఈ సినిమా చూడాల్సిందే’ అనుకుంటారు జ‌నాలు. అదే ఈ సినిమాకి ప్ర‌ధాన‌మైన సేలింగ్ పాయింట్‌. సంక్రాంతి సీజ‌న్‌కి త‌గిన సినిమా ‘ఎంత మంచివాడ‌వురా’. పేరుకు త‌గ్గ‌ట్టు మంచిత‌నం మేళ‌విస్తే… మంచి ఫ‌లితాన్నే అందుకునే అవ‌కాశం ఉంది. ఇక ఈ యేడాది అంద‌రి దృష్టీ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’పై ఉండ‌డం ఖాయం. 

 

ఎన్టీఆర్ – రామ్ చ‌ర‌ణ్ క‌ల‌సి న‌టిస్తున్న చిత్ర‌మిది. రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు. దేశం మొత్తం ఈ సినిమా వైపు చూడ‌డంలో ఆశ్చ‌ర్యం ఏముంది? 300 కోట్ల బ‌డ్జెట్ కేటాయించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క లుక్ కూడా విడుద‌ల కాలేదు. అయినా స‌రే.. ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అదీ రాజ‌మౌళి మ్యాజిక్‌. ఇదీ ఈ యేడాదే విడుద‌ల కానుంది. అంటే.. మ‌రిన్ని రికార్డు బ్రేకింగులు ఈ యేడాది చూడొచ్చ‌న్న‌మాట‌. 

 

విజ‌య్ దేవ‌ర‌కొండ- పూరిల క్రేజీ కాంబినేష‌న్ ‘ఫైట‌ర్‌’ ఈ యేడాదే ప‌ట్టాలెక్కుతుంది. ఇదే ఏడాది విడుద‌ల అవుతుంది. పూరి ఏ క్ష‌ణంలో ఎలాంటి హిట్టు ఇవ్వ‌గ‌ల‌డో ఎవ‌రూ చెప్ప‌లేరు. పైగా విజ‌య్‌తో సినిమా. నిల‌బ‌డిందంటే.. మ‌రో వంద కోట్లు కొట్ట‌డం ఖాయం. చిరంజీవి – కొర‌టాల కాంబినేష‌న్‌లో ఓ చిత్రం ఈనెల‌లోనే సెట్స్‌పైకి వెళ్తుంది. 2020 ద‌స‌రాకి విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. అదీ క్రేజీ ప్రాజెక్టే. 

 

ప్ర‌భాస్ ‘జాన్‌’ కూడా ప్ర‌భంజ‌నాలు సృష్టించే స‌త్తా ఉన్న సినిమానే. `సాహో`లో త‌ప్పిన లెక్క‌ల‌న్నీ దీంతో స‌వ‌రిద్దామ‌నుకుంటున్నాడు ప్ర‌భాస్‌. ఇది కూడా పాన్ ఇండియా ఇమేజ్ తోనే విడుద‌ల అవుతుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘పింక్‌’, బాల‌య్య – బోయ‌పాటి సినిమా, ర‌వితేజ డిస్కోరాజా… ఇలా ఈ ఏడాదిలో విడుద‌ల కానున్న క్రేజీ ప్రాజెక్టుల‌కైతే లెక్కే లేదు. వీటిపై భారీ ఆశ‌లు, అంచ‌నాలు ఉన్నాయి. వాటిలో స‌గం ఆడినా స‌రే – ఈ ఏడాది బాక్సులు బ‌ద్ద‌లు అవ్వ‌డం ఖాయం. ఇక ఈ సినిమాల‌న్నీ దాదాపుగా అన్నీ పెద్ద హీరోల సినిమాలే కాబట్టి క‌లెక్ష‌న్ల‌కైతే ఎటువంటి ఢోకా ఉండ‌ద‌నే చెప్పాలి. మ‌రి విజేత‌లుగా ఎవ‌రు నిలుస్తార‌న్న‌ది మాత్రం తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: