హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ వేదికగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రచ్చరచ్చగా కొనసాగింది. చిరంజీవి, రాజశేఖర్ మధ్య తీవ్ర వాదన జరిగింది.  హీరో రాజశేఖర్ వ్యాఖ్యలతో చిరంజీవి, మోహన్ బాబు వంటి ఇండస్ట్రీ పెద్దలు నొచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అస‌లు విషయంలోకి వెళ్తే.. చిరంజీవి మైక్ అందుకుని 'మా'లో ఏవైనా సమస్యలు ఉంటే మనలో మనమే చర్చించుకుందాం, మంచి ఉంటే అందరికీ వినిపించేలా చెబుదాం అనే కోణంలో మాట్లాడారు. దీనికి హీరో రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరంజీవి తర్వాత రచయిత పరుచూరి గోపాలకృష్ణ మైక్ తీసుకుని మాట్లాడుతుండగానే, ఆయన నుంచి రాజశేఖర్ మైక్ లాక్కొన్నారు.

 

దీంతో డైరీ ఆవిష్కరణోత్సవం రణరంగాన్ని తలపించింది. ఈ వేడుకలో హీరో రాజశేఖర్.. చిరంజీవిని దూషించడం పెద్ద వివాదంగా మారింది. అంతకు ముందు హీరో రాజశేఖర్, మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మధ్య ఇలాంటి మాటల యుద్దమే నడిచింది. అంతకు ముందు మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మధ్య ‘మా’ నిధుల విషయమై పెద్ద రచ్చే నడిచింది. అయితే రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. చిరంజీవిగారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఏవేవో చెబుతుంటారు కానీ, మాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నిప్పులేనిదే పొగరాదు, మనందరం హీరోలుగా యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోలుగా రియల్ లైఫ్ లో చేస్తుంటే అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు" అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

 

ఈ వ్యాఖ్యలకు అక్కడే ఉన్న చాలా మందికి చిర్రెత్తుకొచ్చింది. చిరంజీవికి మోహ‌న్ బాబు, న‌రేష్ లాంటి వాళ్లంద‌రూ స‌పోర్ట్‌గా మాట్లాడారు. అయితే గ‌తంలో న‌రేష్ మ‌రియు రాజశేఖర్ మధ్య కూడా వార్ జ‌రిగింది. అయితే ఈ కోణంలోనే చిరంజీవికి వంత‌పాడుతున్నారంటూ కొంద‌రు అంటున్నారు. ఏదేమైనా టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, సఖ్యత లేకపోవడం అన్నది ఇప్పటి విషయం కాదు. ఎప్పుడు 'మా' సమావేశం జరిగినా ఏదో ఒక వాడీవేడీ వివాదం ఉండడం కామ‌న్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: