మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తన వ్యాఖ్యలతో హీరో రాజశేఖర్ కలకలం రేపిన విషయం తెలిసిందే. రాజశేఖర్ కొద్దిసేపటి క్రితం సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఈరోజు ఉదయం మా డైరీ ఆవిష్కరణలో జరిగిన వివాదంతో రాజశేఖర్ తీవ్రంగా కలత చెందారు. అందువలనే రాజశేఖర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
 
మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో విభేదాలు ఉన్నాయని అన్నారు. "మా" లో విభేదాలు ఉన్నాయని రాజశేఖర్ వ్యాఖ్యలు చేయటంపై ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మురళీ మోహన్ తప్పుబట్టారు. రాజశేఖర్ చేసిన వ్యాఖ్యల వలన మరోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. 
 
చిరంజీవి మాట్లాడుతూ మంచి ఉంటే మైక్ లో చెప్పుకోవాలని చెడు ఉంటే చెవిలో చెప్పుకోవాలని అన్నారు. చిరంజీవి అలా వ్యాఖ్యలు చేయటంపై రాజశేఖర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో విభేదాలు దాచేస్తే దాగవని అన్నారు. ఏదైనా కుండ బద్దలుగొట్టినట్టు చెప్పటమే తనకు అలవాటు అని రాజశేఖర్ అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తన కారు ప్రమాదానికి కారణమని రాజశేఖర్ అన్నారు. 
 
చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారని కానీ ఇక్కడ నిప్పును కప్పి పుచ్చితే ప్రయోజనం లేదని నిప్పును కప్పి పుచ్చినా పొగ వస్తుందని రాజశేఖర్ అన్నారు. మా అధ్యక్షుడిగా నరేష్ ఏకపక్షంగా వ్యవహరించారని రాజశేఖర్ ఆరోపణలు చేశారు. హీరోగా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నామని అదే రియల్ లైఫ్ లో హీరోలుగా ఉంటే విమర్శలు చేస్తున్నారని రాజశేఖర్ అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మరోసారి విభేదాలు భగ్గుమనడం, ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా చేయడంతో ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాల్సి ఉంది. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: