ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ చేసిన ఈ ప్రకటనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ నిర్మాతల్లో గుబులు రేపుతోంది. అమరావతిలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కొందరు నిర్మాతలు రాజధాని విశాఖకు మారే అవకాశం ఉందని చెప్పటంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 
 
మరోవైపు సీఎం జగన్ ఎంతటి వారైనా అక్రమంగా, బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేస్తున్నా సహించటం లేదు. కొందరు నిర్మాతలు బినామీలతో భూములు కొనుగోలు చేయాలని భావిస్తున్నా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని సంకోచిస్తున్నట్టు సమాచారం. కొందరు వైజాగ్ లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నా జగన్ ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తాడో అని ఆందోళన చెందుతున్నారు. 
 
ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలు ఇప్పుడు భూముల విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. సాధారణంగా ఇండస్ట్రీలో కొందరు బ్లాక్ మనీతో తమ బినామీలతో పెట్టుబడులు పెట్టిస్తుంటారని బహిరంగంగానే గాసిప్స్ వినిపిస్తుంటాయి. మరోవైపు ఇప్పటికే అమరావతిలో భూములు కొనుగోలు చేసిన కొందరు నిర్మాతలు నష్టానికైనా భూములను అమ్ముకోవటానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. 
 
అమరావతిలో భూముల విలువ ఇకనుండి తగ్గడమే తప్ప పెరగడం ఉండదని ఎంతో కొంతకు అమ్ముకుంటే మేలని కొందరు నిర్మాతలు విక్రయించటానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్రంలో అవినీతి, అక్రమాల నిర్మూలన దిశగా వేస్తున్న అడుగులు అక్రమార్కులను గజగజా వణికేలా చేస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక అవినీతి తగ్గిందని ప్రజలు బహిరంగంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో అవినీతిని తగ్గించే దిశగా రెండు రోజుల క్రితం ఏసీబీ సమీక్ష చేసిన జగన్ ఈరోజు ఏసీబీ డీజీగా సీతా రామాంజనేయులును నియమించి విశ్వజిత్ ను బదిలీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: