జబర్దస్త్ షో ఎంతో మందికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ ఫేమ్‌తోనే అనసూయ, రష్మీ గౌతమ్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మరోవైపు ఈ ప్రోగ్రామ్‌తో ఎంతో మంది నటులు బయటకు వచ్చారు. వీళ్ల‌లో సుడిగాలి సుధీర్‌, హైప‌ర్ ఆది ముందు వ‌ర‌స‌లో ఉంటారు. ఇక ప్ర‌స్తుతం జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆదిని మించిన వాళ్లు ప్రస్తుతం ఎవరూ లేరు. ఈయన స్కిట్ వస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. జబర్దస్త్ కామెడీ షోలో ఎవరికీ లేని యూ ట్యూబ్ ఫాలోయింగ్ ఆది సొంతం. ఇదిలా ఉంటే.. జబర్దస్త్ కామెడీ షో నుంచి వస్తున్న ఒక్కో కమెడియన్ ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చూపించాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

 

ఇప్పుడు ఇదే బాట‌లో హైప‌ర్ ఆది కూడా ఉన్నాడు. చిన్నచిన్న పాత్రలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న ఆది.. ఇప్పుడు హీరోగా అదృష్టం ప‌రిక్షించుకోనున్నాడు. అయితే ఇప్పటికే జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్లలో సుడిగాలి సుధీర్, ధన్‌రాజ్, శంకర్ లాంటి వాళ్లు హీరోలు అయ్యారు. కానీ ఎవరూ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇటీవ‌ల సుడిగాలి సుధీర్ నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది. కనీస వసూళ్లు కూడా తీసుకురాలేదు. అయినా కూడా హైపర్ ఆది మాత్రం హీరో కావాలని ఆరాటపడుతున్నాడు. కానీ ఎక్కడో ఓ మూలన సుధీర్ సినిమా ఫలితాన్ని చూసి భయపడుతున్నాడు ఆది.  

 

అయితే ఈ మధ్యే యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆది అక్కడే విషయం కన్ఫర్మ్ చేసాడు. సుడిగాలి సుదీర్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన హీరోగా నటించిన చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకున్నాడు ఈ జబర్దస్త్ కమెడియన్. ఇక సుధీర్ మాదిరే త్వరలోనే తాను కూడా హీరో అవుతున్నానని అసలు విషయం చెప్పాడు ఆది. ఇప్పటికే కథలు వింటున్నానని.. తనకు డాన్సులు, ఫైట్లు అస్సలు పడవని.. పూర్తిగా కామెడీ ప్రధానంగా సాగే కథను ఎంచుకుంటానని చెప్పాడు హైపర్ ఆది. కానీ.. అన్నీ ఉన్న‌ సుధీర్ సినిమానే డిజాస్టర్ అవ్వ‌డంతో ఆది టెన్ష‌న్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: