సాధారణంగా మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కాల గమనాన్ని చంద్రమానం సూర్యమానం పద్ధతులలో గణిస్తూ ఉంటారు. మన తెలుగు వారి పండుగలు అన్నీ చాంద్రమాన గణన ప్రకారమే జరుగుతూ ఉంటాయి. అయితే వైకుంఠ ఏకాదశి ఆతరువాత వచ్చే మకర సంక్రాంతి పండుగలు మాత్రమే సౌరమాన ప్రకారం వస్తాయి. నిరంతర విష్ణు చింతనా పరుడు సేవా తత్పరుడు అయిన నమ్మాళ్వారుకు శ్రీమహావిష్ణువు ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ప్రాప్తి కలిగించాడని పురాణ కథనం. 

సకల కార్యాలకు కారణ స్థానం సర్వదేవతలకు పూజా స్థలం సృష్టి స్థితి లయలకు అవసరమైన శక్తి వచ్చే మహా పర్వదినం ఈ ముక్కోటి ఏకాదశి. పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని అంటారు.. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకు శాపవిమోచనం కలగడంతో తమలాగే వైకుంఠద్వారాన్ని పోలిన ద్వారం నుంచి శ్రీహరిని దర్శించుకునేవారికి మోక్షం కలగాలని కోరుకున్నారట. అప్పుడు శ్రీమహావిష్ణువు ఈరోజున ఎవరైతే ఉత్తర ద్వారం ద్వారా వచ్చి తనని దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరం ఇచ్చినట్లుగా పురాణాలు చెపుతున్నాయి. 

ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన ఇహలోకంలో అంధకారంలో కొట్టమిట్టాడుతున్న తమ మనసుకు పరిపక్వత కలిగించమని ఆ భగవంతుని వేడుకోవడం ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది. జీవుడి దేహంలో ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం కలిపి అన్నీ ఏకాదశ ఇంద్రియాలుఅని అంటారు. ఈ ఏకాదశ ఇంద్రియాలనూ నారాయణుడికి అర్పించే అరుదైన అవకాశమే ఈ ముక్కోటి ఏకాదశి. ఈరోజున భక్తులు అంతా ఉత్తర ద్వారం ద్వారా శ్రీమహావిష్ణువు ని దర్శించు కుంటే కలియుగ వైకుంఠ అయిన తిరుపతిలో మాత్రం ఉత్తర ద్వారం కనిపించదు దీనికి పండితులు అనేక కారణాలు చెపుతారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు ను దర్శించిన వారందరికి ఆ కరుణాంత రంగుడి ఆశీస్సులు లభిస్తాయి కాబట్టి అందరు ఈరోజు శ్రీ మహావిష్ణువు ను దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందుదాము..

మరింత సమాచారం తెలుసుకోండి: