అమ్మ అంటే ఎంత చక్కని పదమో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. మనిషి జీవితం అమ్మ చుట్టే అల్లుకు పోతుంది. తొలి అడుగు వేసినప్పటి నుంచి జీవితంలో ఎన్ని అడుగులు వేసినా అమ్మే తొలి గురువు. చిన్నప్పటి నుంచి  అమ్మతో ఉన్న‌ అనుబంధం లోని చిరు ఙ్ఞాపకాల పందిరి. అలాంటి అమ్మ మీదే పాట రాయమంటే, మన చలనచిత్ర గీత రచయితలు ఎంత సంబరపడి పోతారో! అక్షరాలు నేర్పిన అమ్మకు అక్షరహారతి ఇచ్చే అవకాశం వచ్చినందుకు ఎంతగా ఆనందపడతారో! ఆ సంతోష సమయంలో వారి కలం నుంచి ప్రవహించే పాట... అమ్మప్రేమంత తియ్యగా ఉంటుంది. ఆనాటి సముద్రాల రామానుజాచార్యుల నుంచి ఈనాటి మిట్టపల్లి సురేందర్‌ వరకూ ఎంత మంది ఎన్ని పాటలు రాశారు! జాబితాలతో పనిలేదు, గుండెను నింపేసే అమ్మ నవ్వులే అన్నీ!! 

 

‘అన్నమయ్య ర‌చించే గీతాల భావన- త్యాగరాజు రాగంలోని సాధన- ఎన్ని పేర్ల దేవుణ్ని కొలిచినా- తల్లి వేరులా వాటి చాటునా- ఉన్నది ఒక్కటే కమ్మని పేరు అమ్మ’ అని తన తల్లి సుబ్బలక్ష్మిని గుర్తుచేసుకుంటారు ‘సిరివెన్నెల’. ‘పాడే ఈ పాట పేరు- సాగే నా బాట పేరు అమ్మ’ అని చెప్పుకున్న కవి ఆయన. ఇక ‘అమ్మ పాటలు రాయాల్సి వచ్చిన ప్రతిసారీ ఆ అక్షరాల వెనక వాళ్ళ పై ఉన్న ప్రేమ‌ను ఎంత‌లాగా మ‌న‌కు చూపిస్తారో వారి అక్ష‌ర మాల‌ను చూస్తేనే అర్ధ‌మ‌వుతుంది. అమ్మ పై పాట రాయ‌డం అంటే దాని వెన‌క‌  అమ్మ జానకమ్మే ఉంటుంద’నే సుద్దాల అశోక్‌తేజ, ‘దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా’ అని పాడతారు. ‘చిన్నప్పటి మాట... మా అమ్మ మధునమ్మ ఇంట్లో నిరంతరం తిరుగుతూ ఏదో ఒక పని చేస్తుండేది- అందుకే ‘కదిలే దేవత అమ్మ... కంటికి వెలుగమ్మ’ అని రాశానంటారు చంద్రబోసు. ఫలానా అమ్మ పాట ఎలా రాశారని ఏ రచయితను కదలించినా, అమ్మ కొంగు పట్టుకుని తిరిగిన పసిమనసు జ్ఞాపకాలే అలా అక్షరాలుగా మారాయని చెబుతారు చాలా మంది ర‌చ‌యిత‌లు.  

 

      వేటూరికి అమ్మ భాషంటే అభిమానం. ‘మన భాషలోకి బయటి నుంచి పదాలను తెచ్చుకోవచ్చు. కానీ, ఉన్నవి తీసేయడం తప్పు’ అనేవారు. అమ్మకు మారుగా మమ్మీ అంటున్న వాళ్లను చూసే కాబోలు ‘అమ్మ అనేది అచ్చ తెలుగుమాటరా- జన్మజన్మకదే నిత్య వెలుగుబాటరా’ అని హితబోధ చేశారు. అమ్మ అన్న తెలుగు ప‌దానికి మ‌మ్మీ అన్న ఇంగ్లీష్ ప‌దానికి ఉన్న వ్య‌త్యాసాన్ని చెప్పారాయ‌న‌. ‘బొమ్మాబొరుసే జీవితం’ చిత్రం కోసం రాసిన ఈ పాటలో ‘ప్రేమకు పెట్టనికోట మమతల మల్లెలతోట- తన పిల్లల క్షేమమే పల్లవైన పాట- మధుర మధుర మధురమైన మాటరా అమ్మ’ అంటారాయన. ఇలాంటిదే ఇంకో పాట ఉంది. దాని రచయిత ఏవీఎస్‌. తన హాస్యంతో తెలుగువాళ్లకు చక్కలిగింతలు పెట్టిన ఆయన ముప్పయికి పైగా కథలు, మూడు నవలలు రచించారు.  కానీ, చాలామందికి తెలియని విషయం ఏంటంటే... ఏవీఎస్‌ రెండు పాటలూ రాశారు. వాటిలో ఒకటి అమ్మపాట. ‘సూపర్‌హీరోస్‌’ చిత్రంలోని ఆ గీతం... ‘అచ్చ తెలుగుభాషరా అమ్మంటే- అచ్చు వేదఘోషరా అమ్మంటే’. అంటూ ఆయ‌న ఆ పాట‌కి ఎంతో చ‌క్క‌ని న‌ర్వ‌చ‌నాన్ని అందించారు.  ఇలా అమ్మ పై పాట‌లే కాదు అనేక సినిమాలే కూడా ఎన్నో వ‌చ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: