కేవలం నటుడిగానే కాకుండా.. ఇతరులకు సాయం చేయడంలో స్టార్‌ హీరో సూర్య  ముందుంటారనే సంగతి తెలిసిందే. పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు అగరం ఫౌండేషన్‌ ద్వారా  ఆయన కృషి చేస్తున్నారు.  ఆయన ఈ ఫౌండేషన్‌ను గత పదేళ్లుగా నిర్వహిస్తున్నారు. చెన్నైలో ఇటీవల అగరం ఫౌండేషన్‌   తరఫున రెండు పుస్తకాలను విడుదల చేశారు. సూర్య ఈ కార్యక్రమానికి  హాజరయ్యారు. ఈ సందర్భంగా గాయత్రి అనే అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను.. తన చదువుకు అగరం ఫౌండేషన్‌ ఎలా సహాయం చేసిందో వివరించారు. 

 

‘మాది తంజావూరులోని ఓ చిన్న పల్లెటూరు.  ఊర్లో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాను.  దినసరి కూలీగా అమ్మ పనిచేసేది.  క్యాన్సర్‌తో నాన్న బాధపడుతుండేవారు. అయితే పదో తరగతి పూర్తయ్యాక.. ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా కూలీ పనికి పోతానని అమ్మకు చెప్పాను. కానీ అమ్మ మాత్రం మా లాగా నువ్వు కష్టపడకూడదు.. బిచ్చమెత్తుకోని అయిన నిన్ను చదివిస్తానని చెప్పింది. ఆ తర్వాత నేను అగరం ఫౌండేషన్‌లో చేరాను.

 

 కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే నాన్న చనిపోయారు. అప్పుడు చదువు మానేద్దామని అనుకున్నాను. కానీ అమ్మ నీ కోసం నువ్వు చదవాలని చెప్పింది. చాలా మంది ఇక్కడ నన్ను ఎగతాళి చేశారు. అగరం సాయంతో కాలేజీ విద్యను పూర్తిచేశాను. ఆ తర్వాత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. నా జీవితంలో వెలుగులు నింపిన అగరానికి, సూర్య అన్నకు కృతజ్ఞత తెలుపుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను’ అని గాయత్రి తెలిపారు. 

 

అయితే  తన కథ చెబుతున్న సమయంలో వేదికపైనే ఉన్న సూర్య భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటిని ఆపుకోలేకపోయారు. గాయత్రి వద్దకు వచ్చి అప్యాయంగా పలకరించడంతో పాటు ఆమెను ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు సూర్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ.. అగరం ఫౌండేషన్‌కు తోడుగా నిలుస్తున్న వాలంటీర్లకు, దాతలకు, పలు విద్యాసంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: