తన విలక్షణ నటనతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది విజయశాంతి. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. హీరోలతో సమానంగా క్యారెక్టర్లు ఆమె కోసం రచయితలు, దర్శకులు కథలు రాసేవారు. ప్రతిఘటన, రేపటి పౌరులు, కర్తవ్యం, ఒసేయ్.. రాములమ్మ.. ఇలా ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించింది. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవితో పాటు దాదాపు అగ్ర హీరోలందరితో నటించింది. సామాజిక స్పృహ ఎక్కువగా ఉన్న విజయశాంతి అటుపై రాజకీయాల్లోకి వెళ్ళిపోయి సినీ రంగానికి దూరమైపోయారు.

 

 

ఆమె మళ్లీ సినిమాల్లోకి రావడానికి మేకప్ వేసుకోవడానికి దాదాపు 13 ఏళ్ళు పట్టింది. మహేశ్ హీరోగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె నటించారు. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆమెను చూసి ప్రేక్షకులు సంతోషించారనేది నిజం. వేదికపై చిరంజీవితో కలిసి చేసిన సందడి ఆకట్టుకుంది. అయితే.. ఆమె మళ్లీ సినిమాలు చేస్తారా.. రాజకీయాల్లో ఉంటారా అనే ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి. వీటికి ఆమె తన ప్రసంగంలోనే చూచాయగా చెప్పేసారు. ప్రజా సమస్యల కోసం పోరాడుతూనే ఉంటానని.. మరిన్ని మంచి మంచి పాత్రల్లో నటించి మెప్పిస్తానని అన్నారు. దీంతో రాములమ్మ తన ఉద్దేశం చెప్పకనే చెప్పినట్టయింది. నిజానికి బన్నీ.. అల వైకుంఠపురంలో సినిమాకు కూడా విజయశాంతిని సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి.

 

 

ఎంతో మంది సీనియర్ నటీమణులు మంచి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న విజయశాంతి మళ్లీ సినిమాలు చేస్తానని ప్రకటించడం నిజంగా తెలుగు ప్రేక్షకులు ఆనందించే విషయమే అని చెప్పాలి. డాన్సుల్లో, ఉదాత్తమైన పాత్రల్లో, ఆవేశపూరిత పాత్రల్లో విజయశాంతి ఒదిగిపోయేవారు. మళ్లీ అటువంటి వీరోచిత పాత్రలు విజయశాంతికి లభిస్తే ఆమె నట విశ్వరూపం వీక్షించే అవకాశం రావాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటారానడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: