మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతకముందు సినిమాలని ప్రమోట్ చేసే పద్దతి వేరేగా ఉండేది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పడు చాలా రకాల మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఒక సినిమాకి రిలీజయ్యో ముందు ఆడియో ఫంక్షన్.. సినిమా రిలీజై 100 రోజులు ఆడితే శత దినోత్సవం లాంటి రెండు.. మూడు ఫంక్షన్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఫస్ట్ లుక్ నుంచి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరకూ చాలానే వచ్చేశాయి. సినిమా సక్సెస్ అయితే సక్సెస్ మీట్ అంటూ ప్రెస్ మీట్ పెట్టటమే కానీ.. గతంలో మాదిరిగా శతదినోత్సవాలన్నవే లేవు. ఇంకా చెప్పాలంటే అసలు 100 రోజులు థియోటర్స్ లో ఆడే బొమ్మే కనిపించడం లేదు. 

 

గతంలో సినిమా ఒక ప్రయాణంలా సాగేది. సినిమ రిలీజయ్యాక 10 రోజులకి, 25 రోజులకి, 50 రోజులకి, 75 రోజులకి ఆ తర్వాత 100 రోజులకి .. ఇలా విజయవంతమైన ఇన్ని రోజులకు అని ఎప్పటికప్పుడు పోస్టర్స్ పడేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారి పోయింది. ఏ సినిమా అయినా ఇప్పుడు మహా అయితే మూడు రోజులు. ఆ మూడు రోజులు హిట్ టాక్ వస్తే.. ఒక వారం.. మరో పెద్ద సినిమా లేకుంటే రెండోవారం. అంతకు మించి ఎక్కువ రోజులు థియేటర్ల లో కంటిన్యూగా ఆడే పరిస్థితులు ఇప్పుడు లేవు. మొత్తానికి తొలిప్రేమ, పోకిరి లా 225 రోజులు ఆదే సినిమాలు రావడమే లేదు. మారుతున్న కాలానికి తగ్గట్లు గా మిగిలిన అంశాలు మారినా.. మారకున్నా సినిమా ఫంక్షన్లు చేసే విధానాలు మాత్రం మారిపోతున్నాయి. 

 

తాజాగా సినిమా ఫంక్షన్ చేయటానికి మరో కొత్త పదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సినిమా విడుదలకు ముందు చేసే ప్రీరిలీజ్ ఫంక్షన్ పేరు మార్చేశారు. తాజాగా అల వైకుంఠపురములో సినిమాకి మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఎందుకో త్రివిక్రమ్ క్లారిటీ కూడా ఇచ్చేశారు. 'సామజవరగమన' పాటను ఏకంగా 13 కోట్ల మంది విన్నారని చెబుతూ.. పాట మనకు ఊతం.. మనకు గురువు.. మనకు ప్రేయసి అని.. అలాంటి అందమైన పాటల్ని గౌరవించాలనే మ్యూజికల్ నైట్ అని పేరు పెట్టి వేడుకను నిర్వహించినట్లు గా వివరించారు. ఈ కారణంతోనే ప్రీరిలీజ్ ఫంక్షన్ కాస్తా మ్యూజికల్ నైట్ అయ్యింది. ఇకపై.. ఈ పేరుతో మరో కార్యక్రమాన్ని అదనంగా చేసుకునే వీలు త్రివిక్రమ్ పుణ్యమా అని మొదలైందని టాక్ మొదలైంది. మరి రాబోవు రోజుల్లో ప్రీరిలీజ్ ఫంక్షన్ కాస్త మ్యూజికల్ నైట్ అవుతుందా లేక ఇది ఇంకో ఫంక్షన్ లా నిర్వహిస్తారా చూడాలి. ఏదేమైనా సినిమా తెడా కొడితే మాత్రం మునిగేది నిర్మాతే.  

మరింత సమాచారం తెలుసుకోండి: