నెటిజన్లు బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ దీపికా పదుకొనెపై  మండిపడుతున్నారు. అధిక సంఖ్యలో ఆమె నటించిన తాజా సినిమా ఛపాక్‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో  ట్విటర్‌లో #boycottchhapak అనే హ్యాష్‌ట్యాగ్‌  విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. కాగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ యూనివర్సిటీని మంగళవారం దీపిక సందర్శించిన విషయం తెలిసిందే.

 

 జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ నలుపు రంగు దుస్తులు ధరించిన దీపిక.. విద్యార్థులతో భేటీ అయ్యారు. వారికి సంఘీభావం తెలుపుతూ క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో ఆమె  పాల్గొన్నారు.నెటిజన్లు  ఈ నేపథ్యంలో  దీపికను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. తన సినిమా ప్రచారం కోసం దీపిక నీచానికి దిగజారిందని.. దేశ ద్రోహులపై ప్రేమ ఒలకబోస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘  దీపిక కన్హయ్య కుమార్‌, ఆయిషీ ఘోష్‌ వంటి వారికి మద్దతు తెలిపింది. మరి దాడిలో గాయపడిన ఏబీవీపీ వాళ్ల సంగతేంటి.  దీపిక నకిలీ ఫెమినిజంతో ఎన్నాళ్లు నెట్టుకువస్తావు. 

 

ఛీ.. సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముంది.  ఎంతో మంది దేశంలో ఆకలితో అలమటిస్తున్నారు. చదువుకోవాలని తపిస్తున్నారు. వాళ్ల కోసం నీ విలువైన సమయాన్ని కేటాయించవచ్చు కదా’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇక దీపిక అభిమానులు సైతం.. ‘నాకు దేశమే ముఖ్యం. ఆ తర్వాతే నా ఫేవరెట్‌ హీరోయిన్‌ అయినా.. మరెవరైనా. అయితే దీపిక లాంటి సినిమా హీరోయిన్‌ కోసం కాకపోయినా.. ఈ సినిమా నిజమైన హీరో లక్ష్మీ అగర్వాల్‌ కోసం  చూడాలి’ అని ఆమె తీరును తప్పుబడుతున్నారు.

 

ఇంకొంత మంది మాత్రం...‘ దీపికా సినిమాలను అడ్డుకోవాలని చూసిన ప్రతీసారి... ఆమె రేంజ్‌ అంతకంతకూ పెరిగిపోయింది. ఆ సినిమాల వసూళ్లు బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. ఇప్పుడు ఛపాక్‌ కూడా అదే స్థాయిలో రికార్డు వసూళ్లు సాధిస్తుంది. ఆమె నిజమైన హీరో’ అంటూ దీపికకు మద్దతుగా కొంతమంది నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో #boycottchhapak ట్విటర్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా ఛపాక్‌ తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీపిక తొలిసారిగా నిర్మాతగా వ్యవహరించిన జనవరి 10న ఈ సినిమా  విడుదల కానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: