తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కన్నా ముందు ‘అమృతం’ సీరియల్ ఎంతో పాపులారిటీ సంపాదించింది. 90వ దశకంలో పిల్లలంతా పడి పడి చూసిన సీరియల్ 'అమృతం'. అప్పట్లో టీవీలో ఈ కామెడీ సీరియల్ ఓ మోత మోగించింది.  ఇందులో తక్కువ పాత్రలతో అందరినీ కడుపుబ్బా నవ్వులు పూయించేలా ఉండేది. గుణ్ణం గంగరాజు నిర్మాతగా జస్ట్ ఎల్లో బ్యానర్‌పై అమృతం టీవి సీరియల్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది.  ఓ హోటల్ చుట్టూ తిరిగే కథలతో అల్లుకున్న ఎపిసోడ్స్ తో వారం వారం తెలుగువారిని గిలిగింతలు పెట్టేది.  ప్రతి వారం ‘అమృతం’ సీరియల్ వస్తుందంటే టీవీలకు అతుక్కు పోయేవారంటే అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ సీరియల్ చిన్న నుంచి  పెద్ద వయసు ఉన్న ప్రేక్షకులు చాలామందికి అభిమాన సీరియల్.  ఏ ఎపిసోడ్ కు ఆ ఎపిసోడ్ విభిన్నమైన కథలతో కాన్సెప్ట్ లతో అప్పట్లో అమృతంను తెరకెక్కించిన విషయం తెల్సిందే.

 

ఆ మద్య అమృతం సీరియల్ ఈటీవీ ప్లస్ లో ప్రసారం చేశారు. ఆ తర్వాత యూట్యూబ్ లో ఉంచారు. ఇప్పుడు జీ5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై ఉంచారు. తాజాగా  జీ తెలుగు వారు అమృతం వెబ్ సిరీస్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ ఈ సీరియల్ మంచి సక్సెస్ అయితే.. దాన్నే ఛానెల్ లో కూడా ప్రసారం చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. కాగా, అమృతం క్రియేటర్ అయిన గుణ్ణం గంగరాజును ఈ వెబ్ సిరీస్ కోసం రంగంలోకి దించబోతున్నట్లుగా సమాచారం. గతంలో అమృతం సీరియల్ లో ఆంజనేయులు,అప్పాజీ, సర్వం  ఈ మూడు పాత్రల మద్య వచ్చే కామెడీ కడుపుబ్బా నవ్వించేది.

 

అయితే వెబ్ సీరీస్ లో రాబోయే ఈ సీరియల్ లో కాస్త మార్పులు చేర్పులు జరగబోతున్నట్లు సమాచారం.  గతంలో అమృతం సీరియల్ లో అంజి క్యారెక్టర్ లో నటించిన గుండు హనుమంతరావు జీవించిలేరు. మిగిలినవారు చాలా మంది 'అమృతం 2'లో అలాగే కంటిన్యూ అయినా.. గుండు హనుమంత రావు ప్లేస్ లో ఎల్ బీ శ్రీరామ్ ని తీసుకోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అఫిషియల్ ప్రకటన రాలేదు.   టాలీవుడ్ లో ఎల్ బీ శ్రీరామ్ కామెడీ పరంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కాకపోతే ఇప్పుడు అమృతం తీస్తే గతంలో మాదిరిగా అంత అమృతంగా ఉండక పోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: