సంక్రాంతికి ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా అనీల్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చినా అన్నిసార్లు అది వర్క్ అవుట్ అవడం కష్టమే అన్న లాజిక్ మిస్సయ్యాడేమో అని అంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల మొదటి షోలు పడగా సినిమాలో కథ రొటీన్ గా ఉన్నా కథనం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు అనీల్ రావిపుడి. మాములుగా సినిమాలు రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి పూర్తిగా కామెడీతో నడిపించడం.. మరోటి కంప్లీట్ యాక్షన్ మోడ్లో తీయడం.. 

 

అయితే మనోళ్లు కొత్తగా కామెడీకి యాక్షన్ యాడ్ చేస్తారు. ఇప్పటివరకు అనీల్ రావిపుడి చేసిన సినిమాలన్ని ఇలానే యాక్షన్ ఉన్నా సరే కామెడీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు రెండిటిని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసిన అనీల్ రావిపుడి సరిలేరు నీకెవ్వరు విషయంలో అది మిస్సయ్యాడని అంటున్నారు. అన్నిసార్లు కామెడీతో బండి లాగేయొచ్చు అన్న అనీల్ ఆలోచనని రాంగ్ చేసేలా ఉంది సరిలేరు నీకెవ్వరు. మహేష్ పాత్రని పూర్తిగా కామెడీ చేసి అక్కడక్కడ సీరియస్ గా ఉండేలా చేశాడు.

 

ఇక రష్మిక అయితే ఓవర్ యాక్షన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ప్రకాశ్ రాజ్ రెగ్యులర్ విలనిజంతో కనిపించగా విశ్వ నట భారతి విజయశాంతి మాత్రం ఈ సినిమాలో కొత్తగా కనిపించారు. సినిమా ఓపెనింగ్ సీన్.. ఆమె పాత్ర తీర్చిదిద్దిన తీరు మెప్పించేలా ఉంది. కథ అది కూడా రొటీన్ అన్న టాక్ తప్ప సరిలేరు నీకెవ్వరు ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.

 

అయితే అంచనాలు అధికంగా ఉండటం.. సినిమాలో ఇంకా చాలా సర్ ప్రైజులు ఉన్నాయని అనీల్ ఊరించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కథ విషయంలో కొంత అసంతృప్తి తప్ప సినిమా ఎంటర్టైనింగ్ విషయంలో కుమ్మేసిందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: