సంక్రాంతికి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. సంక్రాంతి సందడి ముందే నెలకొంది. థియేటర్లలో అభిమాన హీరోల సినిమాలు చూడటానికి ఎగబడుతున్నారు. ఏకంగా ఈసారి మూడు భారీ సినిమాలు సంక్రాంతి పండగకు కనువిందు చేస్తున్నాయి. పాటలతో, ట్రైలర్లతో అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లిన ఈ సినిమాలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. సంక్రాంతికి విడుదలైన సినిమాలు హిట్టయ్యాయా.. ఫట్టయ్యాయా.. ఇప్పుడు చూద్దాం.

దర్భార్: 
సంక్రాంతికి అన్ని సినిమాలకంటే ముందు వచ్చిన సినిమా దర్బార్. ట్రైలర్ తోనే వింటేజ్ రజనీ అని టాక్ తెచ్చుకున్న దర్బార్.. 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. డైరెక్టర్ మురుగదాస్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. పదేళ్ల క్రితం రజనీ ఎలా ఉండేవాడో ఈ సినిమాలో అలా చూపించాడు దర్శకుడు మురుగదాస్‌. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోసారి రజనీ సినిమా కోసం చెన్నై లోని పలు కార్పోరేట్ సంస్థలు ముందుగానే సెలవును ప్రకటించాయి. దీన్నిబట్టే అర్థమవుతోంది...రజనీ స్టామినా అక్కడ ఎలా ఉందో అని. దానికి తగ్గట్టుగానే సినిమా పాజిటివ్ టాక్ రావడంతో రజనీ ఈజ్ బ్యాక్ అని అభిమానులు సందడి  చేస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు:
    దర్బార్ చిత్రానికి రెండు రోజుల తర్వాత సంక్రాంతి బరిలోకి మహేష్ బాబు దిగారు. ఈ సంక్రాంతికి భారీ అంచనాలతో సరిలేరు నీకెవ్వరు సినిమా 11 వతేది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి రావడం, ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్  చేయడం అభిమానులను ఇంకా ఆనందంతో ముంచెత్తేలా చేశాయి. వరుస విజయాలతో ఉన్న అనీల్ రావిపూడికి అదే రోజు అబ్బాయి పుట్టడం మరింత ఆనందాన్ని కలిగించిన విషయం. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది సరిలేరు నీకెవ్వరు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ అనిల్ రావిపూడి చేసిన ప్రయత్నం ప్రేక్షకులను కట్టిపడేసింది. కొండారెడ్డి బురుజు సీన్ అయితే ఒక్కడు మూవీని తలపించింది. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి హుందాతనంగా నటించారు. మొత్తానికి బొమ్మ దద్దరిల్లేలా... అభిమానులు సరిలేరు నీకెవ్వరు పండగ చేసుకుంటున్నారు.

అల వైకుంఠపురంలో..:
  సంక్రాంతి బరిలో ముందు నుంచే నువ్వా.. నేనా అన్నట్టు పోటీ పడుతున్న సినిమాలు అలవైకుంఠపురంలో.. సరిలేరు నీకెవ్వరు. పాటల నుంచీ సినిమా తేదీ వరకూ ప్రతి విషయంలో పోటీ పడిన ఈ సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో విడుదలయ్యాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇద్దరిదీ ఇది మూడో సినిమా కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. సామజవర గమన, రాములో రాములా సాంగ్స్  ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అల్లుఅర్జున్ సినిమా కూడా చాలా గ్యాప్ తర్వాత రావడం వల్ల అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని ఎదురుచూశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అల్లుఅర్జున్ ఇది వరకూ రెండు సినిమాలు భారీ విజయాలు సాధించడంతో హ్యాట్రిక్ పక్కా అని , సంక్రాంతి మరింత సందడిగా మారబోతుందని అభిమానులు ఎదురుచూశారు. 12వ తేది అంటే ఈరోజే అల వైకుంఠపురంలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఈ సినిమాలో టబు కంబ్యాక్ బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. మొత్తానికి మాటల మాంత్రికుడు మరోసారి మ్యాజిక్ చేశాడని, ఈ సినిమాతో వీరిద్దరూ హ్యాట్రిక్ సాధించారని అభిమానులు సందడి చేస్తున్నారు. 
 
మొత్తానికి భారీ అంచనాల మధ్యవచ్చిన మూడు సినిమాలు సంక్రాంతికి సందడి చేస్తున్నాయి. ఐదు రోజుల ముందు నుంచే పండగ వాతావరణం నెలకొంది. ఏ ఒక్క సినిమా కూడా నిరాశ పరచకుండా అభిమానులను, ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. మొత్తానికి రజనీ దర్బార్ అనిపించగా.. మహేష్ సరిలేరు నీకెవ్వరు అనిపించారు. గ్యాప్ ఇచ్చిన బన్నీ అల వైకుంఠపురంతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. మొత్తానికి మూడు సినిమాలు.. మూడు విజయాలతో హల్ చల్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: