టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా ఇటీవల తెరకెక్కిన ఎఫ్2, వెంకీ మామ సినిమాలు మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఎఫ్2 లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి మంచి కామెడీని పండించి సూపర్ హిట్ కొట్టిన వెంకీ, ఆ తరువాత ఇటీవల తన మేనల్లుడు నాగచైతన్య తో కలిసి నటించిన వెంకీ మామలో కామెడీతో పాటు హృద్యమైన సీన్స్ లో నటించి మరొక్కసారి తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు వెంకీ. ఇక ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ ఈనెల 20న ప్రారంభం కానుంది. 

 

ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా ఇటీవల ప్రియమణి ఎంపిక అయింది. కొత్తబంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల తమిళ్ లో యూత్ స్టార్ ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన అసురన్ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. వి క్రియేషన్స్ వారు నిర్మించిన ఆ సినిమానే ప్రస్తుతం వెంకటేష్ రీమేక్ చేస్తున్నారు. అందులో హీరోయిన్ మాళవిక మోహనన్ స్థానంలో తెలుగులో ప్రియమణి హీరోయిన్ గా అవకాశం దక్కించుకోగా, ఇతర పాత్రల వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. 

 

మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాపై వెంకటేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఓవైపు బ్రహ్మోత్సవంతో భారీ డిజాస్టర్ చవిచూసిన శ్రీకాంత్ అడ్డాల, ఎలాగైనా ఈ సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. నెలరోజుల పాటు అనంతపురంలో షూటింగ్ అనంతరం వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి వేసవి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్. మరి తమిళ అసురన్ మాదిరిగా ఈ సినిమా తెలుగులో ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: