సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంటింటా సంబరమే. పల్లె లోగిళ్లు అయితే చలికాలపు మంచుతో తెల్లారుతూ ఉంటాయి. చలిలో వెచ్చని భోగి మంట వేయని వీధి.. అక్కడ చలి కాచుకోని వారూ ఉండరు. ఇంతటి ఆనందాన్ని సినిమాల్లో చాలా చక్కగా చూపిస్తూంటారు మన దర్శకులు. వారిలో కృష్ణవంశీ 23 ఏళ్ల క్రితం తన సిందూరం సినిమాలోని ఓ పాటలో సంక్రాంతి సందడిని.. అంతకుమించి పల్లెటూళ్లలోని భోగి మంటల వేడిని ఒక్కపాటలో చూపించి తన దర్శకత్వ ప్రతిభను చాటాడు. 1997లో వచ్చిన ఈ సినిమా నేపథ్యం వేరు. కానీ.. సంక్రాంతి పండుగను, భోగి మంటల సంబరాలను కృష్ణవంశీ చక్కగా ప్రెజెంట్ చేశాడు.

 

 

“ఏడు మల్లలెత్తు సుకుమారికి.. ఎంత కష్టమొచ్చింది నాయనో.. భోగి పళ్లు పొయ్యాలి బేబికి.. ఎంత దిష్టి కొట్టింది నాయనో..” అనే పాట తీసుకొచ్చే ఉత్సాహం అంతా ఇంతా కాదు. సినిమా సంక్రాంతి సమయంలో విడుదల కాకపోయినా సినిమాలో ఈ పాట చూస్తున్నంతసేపూ మనం సంక్రాంతి రోజుల్లో ఉన్నట్టే ఉంటుంది. సంక్రాంతి పండుగ ఎప్పుడొస్తుందా.. భోగి మంటలు ఎప్పుడు వేద్దామా అని ఎదురుచూసేలా ఆ పాట ఆసక్తి రేకెత్తిస్తుంది. అమ్మాయిల పరికిణీ అందాల్లో ముగ్గులు వేయడం.. హరిదాసుల కోలాహలం. గంగిరెద్దుల ఉత్సాహం, గొబ్బెమ్మల అందం.. ఊరంతా ఒక్కటై జరుపుకునే పండుగ సంబరం.. కలగలిపి ఒక్కపాటలో కృష్ణవంశీ చూపించిన సంక్రాంతి సంబరాన్ని ఇప్పటికీ ఏ సినీ ప్రేమికుడూ మరచిపోడు.

 

 

తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం పరిసర గ్రామాల్లో ఈపాటను తెరకెక్కించాడు కృష్ణవంశీ. ఇన్నేళ్లయినా ఆ పాటలోని అందం, చిత్రీకరణ, సాహిత్యం, పల్లెలోని సందడిని ఆస్వాదించాల్సిందే. వచ్చే ప్రతి సంక్రాంతికి ఆ పాట చాలామందికి తలంపుకొస్తూ కృష్ణవంశీకి ట్వీట్స్ చేస్తూ ఉంటారు కూడా. భోగి మంటలో చలి కాచుకుంటూ.. వేడి నీళ్లు కాస్తూ చిన్న పిల్లల అల్లరితో సంక్రాంతి పండుగను భోగితో ప్రారంభించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: