మన తెలుగు వాళ్ళందరికి ఎంతో ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ అనగానే ముందుగా మన అందరికి గుర్తొచ్చేది బోగి. మూడురోజుల సంక్రాతిలో ముందుగా రోజు జరుపుకునేదే బోగి పండుగ. ఈ రోజున ప్రతి ఊరులో బోగి మంటలతో పండుగ ప్రారంభమవుతుంది. ఈ బోగి ప్రత్యేకతలు ఏమితెలుసా ..! తొలి రోజు జరుపుకొనే భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందని చెబుతుంటారు మన పూర్వీకులు, పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలన్న పరమార్థమే 'భోగి' పండుగ విశిష్టత.. ప్రత్యేకత. 

 

భోగి రోజున తెల్లవారు జామునే లేచి భోగిమంటలు వేయడం ఆనవాయితీ... సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు వంటివి భోగి మంటల్లో వేస్తారు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. అంటే పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి.. కొత్తమార్గంలోకి వచ్చి పయనించాలని దీనికి అర్థమని మవ పెద్ద వాళ్ళు తెలిపారు. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. ఇది ఆడ పిల్లలు, పెద్ద వాళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.

 

ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుందన్న పరమార్థం కూడా ఇందులో ఉంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే.. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు. వీటితోపాటు నెలరోజులుగా వేస్తున్న ముగ్గులు కూడా మరింత శోభనిస్తాయి ఈ భోగి పండుగకు. జాడ్యాన్ని వదలడం, కొత్తదనాన్ని స్వాగతించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి శాస్త్రీయ కోణాలు ఈ పండుగ ప్రత్యేకతలో దాగి ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: