మూడురోజుల పండుగ అయిన సంక్రాంతిలో చివరి రోజున వచ్చే కనుమ పండుగను పశువుల పండుగగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఈరోజు తెలుగు రాష్ట్రాలలోని పల్లె ప్రాంతాలలో ఈరోజు పశువులను పూజించడం ఒక సాంప్రదాయంగా అనాదికాలం నుంచి వస్తోంది. ఒకప్పుడు వ్యవసాయం తప్ప మరి ఏ వృత్తి భారతీయులకు తెలియదు కాబట్టి వ్యవసాయంలో తమకు అన్నివిధాల సహకరించే పసువులను నందీశ్వరులుగా భావిస్తూ ఈరోజు వాటికి అలంకరించి పూజలు చేస్తారు. 

పంట పొలాల నుండి తమ ఇంటి కొచ్చిన పంటను భారతీయ హిందూ ధర్మం ప్రకారం ఒక గొప్ప సంపదగా  ఆరాధిస్తారు. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సహయపడిన పశువును అవి చేసిన సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తామేకాక పశువులు పక్షులతో పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్ప సంపదగా ఒకప్పుడు భావించేవారు. 

పల్లె ప్రాంతాలలో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటూ ఈరోజు నుండి పశువులకు కొన్ని రోజులు విశ్రాంతి ఇచ్చి పల్లె వాసులు అంతా రకరకాల పిండివంటలు కోడి పందేలు ఎడ్ల పందాలతో ఈ సంక్రాంతి మూడవరోజు పండుగను చాల ఆనందంగా జరుపుకుంటారు. అంతేకాదు పశువులతో తమకి గల అనుబంధాన్ని మరింత బలపరుచుకోవడానికి కనుమ రోజున రైతులు తమ పశువులను నదీ తీరాలకు గానీ, చెరువుల దగ్గరికి గాని తీసుకు వెళ్లి స్నానం చేయిస్తారు. ఆ పశువుల నుదుటున పసుపు, కుంకుమదిద్ది వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు. వాటి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ తగిలిస్తారు.

ఇది అంతా కనుమ పండుగ రోజున కొనసాగే హడావిడి. సంక్రాంతి చివరి రోజు అయిన ఈ కనుమ రోజున ఎవరూ ప్రయాణం చేయరాదు అన్న ఒక సెంటిమెంట్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అంతేకాదు కనుమ రోజున కాకి కూడ కదలదు అన్న సామెత కూడ ఉంది. దీనికి కారణం కనుమరోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు వస్తాయని పెద్దల నమ్మకం. ఇప్పడు జీవితం యాంత్రికంగా మారిన ఈ పరిస్థితులలో ఇలాంటి సెంటిమెంట్స్ పట్టించుకునే అవకాసం లేకపోయినా గడిపిన సంక్రాంతి ఆనందాలను గుర్తుకు చేసుకుంటూ వచ్చే ఏడాది రాబోయే మరొక సంక్రాంతి కోసం ఎదురు చూస్తూ తెలుగు వారు ఆనందంతో ఈరోజుతో ముచ్చటగా మూడు రోజుల పండుగకు వీడ్కోలు చెపుతారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: