మూడు రోజుల పండుగ సంక్రాంతి ముగిసి పోవడంతో ఈరోజు నుండి పండుగ వాతావరణం నెమ్మదిగా తగ్గిపోతుంది. సంక్రాంతి రేసు సినిమాల పై సగటు ప్రేక్షకుడు తీర్పు కూడ బయటకు రావడంతో ఫిలిం ఇండస్ట్రీలో కూడ పెద్దగా ఈరోజు ఏమి సంచలనాలు ఉండవు. అయితే ఇలాంటి స్తబ్ధమైన రోజున మరి కొన్ని గంటలలో ప్రభాస్ మ్యానియా కనిపించబోతోంది. 

ప్రభాస్ ఈరోజు తన పేస్ బుక్ ఖాతా ద్వారా తన లేటెస్ట్ మూవీ గురించి ఒక అప్డేట్ ఇవ్వనున్నారని చిత్ర నిర్మాతలు ప్రకటించడంతో ఆ అప్డేట్ గురించి ప్రభాస్ అభిమానులు ఈరోజు ఉదయం నుండే చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘సాహో’ పరాజయం తరువాత ప్రభాస్ కు సంబంధించిన ఎటువంటి వార్తలు అధికారికంగా వెలువడక పోవడంతో ఈరోజు ప్రభాస్ తన ఫేస్ బుక్ ద్వారా ఏమి చెప్పబోతున్నాడో అన్న ఆసక్తి బాగా పెరిగి పోయింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ రాథా కృష్ణ దర్శకత్వంలో లేటెస్ట్ మూవీ టైటిల్ ప్రకటన ఈరోజు ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ప్రచారంలో ఉన్న ‘జాన్’ టైటిల్ ‘జాను’ గా మారి సమంత శర్వానంద్ ల  ‘96’ రీమేక్ కు టైటిల్ గా మారడంతో ప్రభాస్ కొత్త మూవీ టైటిల్ ఈరోజు ప్రకటన జరగ వచ్చు అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.

మరికొందరైతే ఈ మూవీ షూటింగ్ కు గ్యాప్ ఇచ్చిన ప్రభాస్ ఈ మూవీని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్న నేపధ్యంలో ఆ మూవీ షూటింగ్ విశేషాలను తెలుపుతూ ప్రభాస్ తన అధికారిక సమాచారాన్ని తన అభిమానులతో పంచుకుంటాడు అని అంటున్నారు.   1960 కాలం నాటి కథతో సినిమాగా తీయబోతున్న ఈ మూవీని వీలైనంత త్వరలో పూర్తి చేసి ఈ ఏడాది విడుదల చేసి ‘సాహో’ పరాభవం నుండి బయటపడాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు..   

మరింత సమాచారం తెలుసుకోండి: