సాయి కుమార్.. తన స్వరాన్నే ఆయుధంగా చేసుకున్న కళాకారుడు, నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. విజయనగరం జిల్లాకు చెందిన ఈ కళాకారుడు దక్షిణాదిలో మంచి నటుడుగా గుర్తింపు పొందారు. పోలీస్ స్టోరీ సినిమాతో ఒక్కసారిగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత కూడా హీరోగా నటించి ప్రస్తుతం బుల్లితెరపైనా సందడి చేస్తున్నారు. ఆయన యాంకర్ గా ఒక ప్రముఖ ఛానెల్లో మనం అనే కార్యక్రమం ప్రసారమవుతోంది.

 

మిగిలిన తలతిక్క ప్రోగ్రాముల్లా కాకుండా.. కుటుంబాల అనుబంధాలను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం హృద్యంగా సాగుతోంది. అయితే.. తాజగా సంక్రాంతి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు సాయి కుమార్. తన కుటుంబంతోనే ఈ సారి మనం కార్యక్రమం డిజైన్ చేశారు. తన ఫ్యామిలీ, తన బంధువులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అంత వరకూ ఎవరైనా చేస్తారు.

 

కానీ ఈ కార్యక్రమంలో సాయి కుమార్ ఓ అడుగు ముందుకేసి తానెంత సహృదయుడో, సున్నిత మనస్కుడో చెప్పకనే చెప్పారు. తన ఆత్మీయ బంధువులను ఎంతగా ఆయన గుర్తు పెట్టుకున్నాడో.. అంతే ఆప్యాయతతో నిత్యం తనకు సహాయంగా ఉండే.. మేకప్ మేన్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైలిస్టు, కారు డ్రైవర్, అసిస్టెంట్.. ఇలా తన సిబ్బంది అందరినీ మనం వేదిక మీదకు పిలిపించి పరిచయం చేశారు.

 

అంతే కాదు.. రోజూ.. తనతో తన బంధువులు ఉండకపోవచ్చేమో కానీ.. వీళ్లందరూ లేకుండా నేను లేను.. వీళ్లు లేకుండా నాకు పూట కూడా గడవదు అంటూ తన సిబ్బందిని ఆకాశానికెత్తేశారు. తానో హీరో.. అన్న బేషజం లేకుండా తన సిబ్బంది అందరినీ ఆప్యాయంగా వేదికపైకి పిలిచి వారిని సన్మానించారు. సాధారణంగా సినిమా రంగంలో ఇలాంటి సిబ్బందికి ఎలాంటి గుర్తింపు ఉండదు. కానీ వారు లేకుండా ఏ నటుడికీ పూట గడవదు. కానీ సాయికుమార్ లా సిబ్బందిని ఆప్యాయంగా హృదయానికి హత్తుకునేంత సహృదయం ఎందరు స్టార్లకు ఉంది.. ? సాయీ యూ ఆర్ గ్రేట్..

మరింత సమాచారం తెలుసుకోండి: