ఇప్పుడు బుల్లి తెర.. పెద్ద తెరని మించిపోయింది. ఇంటిళ్లపాదినీ కట్టి పడేస్తోంది. ఎప్పుడో వచ్చే ఓ సినిమాతో కన్నా.. రోజూ వచ్చే ప్రోగ్రాములతో సదరు యాంకర్లు సినీ స్టార్ల స్థాయిలో పబ్లిక్ ఫిగర్లు అవుతున్నారు. అంతా బాగానే ఉన్నా.. రేటింగుల కోసం, పాపులారిటీ కోసం, పబ్లిసిటీ కోసం ఈ బుల్లి తెర యాంకర్లు కూడా పక్కదారి పడుతున్నారు. లేని పోని కాంట్రావర్శీలు క్రియేట్ చేయడం, ఉత్తిత్తిగా తిట్టుకోవడం వంటి పనులు చేస్తూ రేటింగ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు.

 

ఇక బుల్లి తెర యాంకర్లంటే ముందుగా గుర్తొచ్చేది రోజా, నాగబాబే. ఎందుకంటే పెద్ద తెరపై దశాబ్దాల తరబడి కనిపించి బుల్లి తెరకు షిఫ్టు అయిన నటులు వీరు. అలాంటి వారు కూడా అటు బుల్లి తెర షోల్లోనూ.. బుల్లి తెర బయటా తమ స్థాయికి తగినట్టుగా కాకుండా ప్రవర్తిస్తున్నారు. ఇక నాగబాబు తన సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాక.. తన మనసులో ఉన్నదంతా కక్కేస్తున్నారు. కేవలం నాగబాబు, రోజా అనే కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే బుల్లి తెరపై రేటింగుల కోసం, చిల్లర వేషాలు వేసేవారికేం కొదువ లేదు.

 

కానీ అందర్నీ ఒకే గాటన కట్టలేం.. ఎందుకంటే.. ఇదే బుల్లి తెరపై ఒకప్పటి హీరో సాయికుమార్ కూడా మనం అనే ఓ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ సుకుటుంబ సపరివారంగా చూసేలా తీర్చిదిద్దుతున్నారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా తన కుటుంబంతోనే ఈ సారి మనం కార్యక్రమం డిజైన్ చేశారు సాయి కుమార్. తన ఫ్యామిలీ, తన బంధువులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

 

అంతే కాదు.. తన ఆత్మీయ బంధువులను ఎంతగా ఆయన గుర్తు పెట్టుకున్నాడో.. అంతే ఆప్యాయతతో నిత్యం తనకు సహాయంగా ఉండే.. మేకప్ మేన్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైలిస్టు, కారు డ్రైవర్, అసిస్టెంట్.. ఇలా తన సిబ్బంది అందరినీ మనం వేదిక మీదకు పిలిపించి పరిచయం చేశారు. వీళ్లందరూ లేకుండా నేను లేను.. వీళ్లు లేకుండా నాకు పూట కూడా గడవదు అంటూ తన సిబ్బందిని ఆకాశానికెత్తేశారు. తన సిబ్బంది అందరినీ ఆప్యాయంగా వేదికపైకి పిలిచి వారిని సన్మానించారు. సాయి కుమార్ చేసిన ఈ పని అందరితోనూ శభాషనిపించేలా చేస్తోంది. సాయి కుమార్ ను చూసి మిగిలినవాళ్లు చాలా నేర్చుకోవాలన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: