పొరపాటున కర్మ కాలి ఒక భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా గనక ఫ్లాపయితే ప్రొడ్యూసర్ వచ్చి రోడ్డు మీదపడుతున్నాడు. లేదంటే ట్యాంక్ బండ్ లో దూకుతున్నాడు. అలా ఉంది నిర్మాతల పరిస్థితి. పెద్ద నిర్మాతలే ఇపుడు నిర్మాతల పరిస్థితి ఏం బాగోలేదు అంటూనే హీరోలకి కోట్లలో రెమ్యూనరేషన్, హీరోయిన్స్ ముంబాయ్ నుండి రావాలన్న బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్ ..ఇక్కడికొచ్చాక ఆవిడగారికి కాస్ట్లీ హోటల్ లో అకామిడేషను ..కావలసినవన్ని సర్ధుబాటు ..ఇవన్ని కలిసి సినిమా బడ్జెట్ కంటే ఇలా అయ్యో బడ్జెటే తడిసి మోపెడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక పాటకు 3-4 కోట్లు ఖర్చు చేయడం అంటే ఇక దీన్ని ఏమనాలో మరి. అల వైకుంఠపురములో సాంగ్ మేకింగ్ కి పాతిక లక్షలు ఖర్చు పెట్టారంటేనే జనాలు 'పాతిక లచ్చలా' ... అని నోరెళ్ళ బెట్టారు. 

 

అలాంటిది ఒక పాటకు 4 కోట్లు ఎలా పెట్టాలనిపించిదో మేకర్స్ కి. సినిమాలో ఏదో స్పెషల్ వుంటేనే ఆడియన్స్ సినిమాను చూస్తున్నారు. అందుకే నిర్మాతలు, దర్శకులు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడడం లేదు కూడా. ఇది ఒప్పుకోవాల్సిన విషయమే. అయితే రవితేజ హీరోగా, ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న రామ్ తాళ్లూరి సినిమా డిస్కోరాజా కోసం మూడు నాలుగు కోట్ల ఖర్చుతో ఓ పాటను షూట్ చేయడం అంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఆ బడ్జెట్ లో పెళ్ళి చూపులు, కేరాఫ్ కంచేర పాలెం వంటి సినిమాని తీయోచ్చు.

 

రవితేజ ఎలా వుంటే తన ఫ్యాన్స్ కు నచ్చుతుందో, రవితేజ కు ఏ స్టయిల్స్ అయితే నప్పుతాయో అలాంటి స్టయిల్స్ జోడించి ఈ సాంగ్ ను తయారుచేశారని చెప్పడం ఇక్కడ మరీ విడ్డూరం. పాట ఎంత గొప్పగా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితులల్లో సినిమా సూపర్ హిట్ అన్నా కూడా రెండవసారి థియోటర్ కి రావడం లేదు. అలాంటిది ఒక్క పాట కోసం ప్రేక్షకులు ఎలా సినిమాకి మళ్ళీ మళ్ళీ వస్తారు చెప్పండి.

 

ఈ సినిమాకు ఈ సాంగ్ ఎంతగా ప్లస్ అవుతుందని మేకర్స్ నమ్మినా కూడా అది అతిగానే అనిపిస్తుంది. అందుకే ఖర్చు చేశాము కదా అని ఈ సాంగ్ ని గట్టిగా ప్రచారం చేస్తున్నారు చిత్ర బృందం. ఇక బాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి చాలా కాలం తరువాత తెలుగు పాట పాడడం, దానికి రవితేజ గొంతు కలపడం ఇవన్నీ పాటకు అదనపు హంగులు అంటున్నారు. మరి ఇన్ని హంగులున్నా చివరకి పాట ఏమేరకు ఆకట్టుకుంటుందో ఆకట్టుకున్నా ఈ ఒక్క పాట నాలుగు కోట్లు రాబడుతుందో చూడాలి. ఇక ఈ డిస్కోరాజా ఈ నెల 24న విడుదలకు సిద్దంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: