సినీరంగం అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఈ పేరు చెప్పి మాయచేసేవారికి అంతూపొంతూ లేదు. కానీ.. ఈ రంగం గురించి అన్నీ తెలిసిన ఓ సీనియర్ నటీమణి కూడా పాపం.. ఘోరంగా మోసపోయింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లో ఉంటున్నఓ సీనియర్ నటి.. ఆమె ఎక్కువగా హాస్య, కుటుంబ కథా చిత్రాల్లో నటించారు. టీవీ సీరియళ్లకు ఆదరణ పెరుగుతుండడం చూసి ఆ ఫీల్డులోకి ఎంటరయ్యారు. నాలుగైదేళ్ల క్రితం నుంచి ఆ రంగంలో ఉన్నారు.

 

తానే ప్రధాన పాత్రగా పలు సీరియళ్లలో నటించారు. అప్పుడు ఆమెకు జి.ఆర్. ఇంటిపేరుగా ఉన్న అన్నపూర్ణ, అనిత, అనిల్ కుమార్, జి. స్వరూప పరిచయమయ్యారు. తాము టీవీ సీరియళ్లను నిర్మించి పెద్ద నిర్మాతలకు హక్కులు విక్రయిస్తుంటామన్నారు. ముగ్గురు నిర్మాతలు మూడు సీరియళ్లు చేసి ఇవ్వాలని కోరారన్నారు. తాము రూ.4కోట్లకు వాటిని నిర్మించి ఇస్తే.. వారు రూ.6కోట్లు ఇస్తారంటూ ఆ సహాయ నటికి చెప్పారు.

 

వారి మాటలు గుడ్డిగా నమ్మేసిన ఆమె.. వారికి రెండేళ్ల క్రితం రూ.4కోట్లు ఇచ్చింది. నలుగురూ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అసలు, వడ్డీ ఎగేశారు. డబ్బుకోసం నిలదీస్తే చెల్లని చెక్కులు ఇచ్చారు. ఆమె గట్టిగా ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారు. పాపం ఆ నటి చేసేదేమీ లేక సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. వారు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

 

ఓ సహాయ నటి నుంచి రూ.4కోట్లు తీసుకొని ఎగవేసిన ఈ కేసు ఇప్పుడు సినీరంగంలో హాట్ టాపిక్ అయ్యింది. తక్కువ ఖర్చుతో టీవీ సీరియళ్లు రూపొందిస్తాం.. రూ. 4కోట్లు రుణం ఇస్తే 20నెలల్లో వడ్డీతో సహా తిరిగి ఇస్తాం' అంటూ మోసగించిన తీరు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అంత సీనియర్ నటి ఎలా మోసపోయిందో అంటూ జాలి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: