మీరు హైదరాబాద్ లో నివశిస్తున్నారా...? వీకెండ్ లో మల్టీప్లెక్స్ లలో సినిమాలు చూస్తున్నారా...? ఐతే మీకో షాకింగ్ న్యూస్... మల్టీప్లెక్స్ లలో టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. థియేటర్ల యాజమాన్యాలు ఇప్పటికే టికెట్ రేట్లను శాశ్వతంగా పెంచుకోవడానికి పోరాడుతుండగా ఇప్పటికే హైదరాబాద్ లోని 34 థియేటర్లలో పెరిగిన రేట్లు అమలులో ఉన్నాయి. 
 
గతంలో 34 మల్టీప్లెక్స్ యాజమాన్యాలు టికెట్ ధరల పెంపు కొరకు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ యాజమాన్యాలు ప్రస్తుతం 138 రూపాయలుగా ఉండే సినిమా టికెట్ ధరను 200 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. కోర్టు ఇప్పటికే టికెట్ ధరల పెంపు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో 34 మల్టీప్లెక్స్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా డిసెంబర్ నెల 20వ తేదీ నుండి జనవరి 26వ తేదీ వరకు టికెట్ ధరలను పెంచుకోవటానికి కోర్టు అనుమతి ఇచ్చింది. 
 
తాత్కాలికంగా టికెట్ రేట్లను పెంచుకోవడానికి కోర్టు ఇచ్చిన అనుమతి రేపటితో ముగియనుంది. గతంలో అమీర్ పేట్, శామీర్ పేట్ లో ఉన్న పీవీఆర్ సినిమా హాల్ కు, ప్రసాద్స్, కూకట్ పల్లి, శాలిబండ సినీపోలిస్, కూకట్ పల్లి, అత్తాపూర్ సినీప్లెక్స్, నెక్స్ట్ గెలెరియా మాల్, సెంట్రల్ మాల్, సుజనా ఫోరమ్ లకు టికెట్ రేట్లను పెంచుకోవడం కొరకు తాత్కాలిక అనుమతి లభించింది. 
 
తాము ఉత్తమమైన సేవలను అందిస్తున్నామని అందువలన టికెట్ రేట్లను పెంచుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఈ థియేటర్లు కోర్టును కోరాయి. కానీ హైకోర్టు అనుమతి ఇచ్చిన థియేటర్లు మాత్రమే కాక అనుమతి ఇవ్వని థియేటర్లలో కూడా టికెట్ రేట్లు పెరిగినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం టికెట్ రేట్లపై స్పందించని పక్షంలో మరోసారి అన్ని మల్టీప్లెక్సుల యాజమాన్యాలు కలిసి కోర్టును ఆశ్రయించి టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం ఉంది. థియేటర్ల యాజమాన్యాలు మరోసారి కోర్టుకు వెళితే టికెట్ల రేట్ల పెంపుకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్ని మల్టీప్లెక్సుల టికెట్ల రేట్లు పెరగనున్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: