ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మన దేశానికి రెండు జాతీయ పండుగలు. 200 సంవత్సరాల దాస్య పరిపాలన నుండి విముక్తి కలిగి స్వాతంత్ర్యం పొంది ధైర్యంగా మన జెండాను మనం ఎగరవేసుకోగలిగిన పండుగగా ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటే జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా మనం వేడుకలను జరుపుకుంటాం.

అయితే జనవరి 26న జరిగే ఈ గణతంత్ర దినోత్సవంనాటి నుండి మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. వాస్తవానికి భారతరాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న ఆమోదించారు. అయితే దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు ఆగారు. లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేసిన తేదీని గుర్తుకు చేసుకుంటూ జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం 1950 జనవరి 26 నుండి  అమలులోకి వచ్చింది. 

ఎంతో చైతన్యంగల పాశ్చాత్య దేశాలు అయిన అమెరికా రష్యాలకు కూడ మన భారత దేశం ఏర్పరుచుకున్న స్థాయిలో భారీ రాజ్యాంగం లేదు. బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడుగా ఏర్పాటు చేయబడ్డ రాజ్యంగ పరిషత్ బాబా సాహెబ్ అంబేత్కర్ నేతృత్వంలో అలనాటి అనేకమంది మేధావులు రాజకీయ నాయకుల సలహాలను తీసుకుని అతి పెద్ద రాజ్యాంగాన్ని మనకు మనం రూపొందించుకుని ఈ రోజు నుండి మన సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి తెలియ చేసాము. భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం గా ఈరోజు మన భారత్ ప్రపంచ పటంలో ఒక ప్రముఖ స్థానాన్ని ఏర్పరుచుకుంది. 

రాజ్యాంగానికి ఇప్పటి వరకు ఎన్నో సవరణలు జరిగినా మన భారత రాజ్యాంగం లోని ప్రాధమిక హక్కులు విధులు అన్నీ కూడ మన రాజ్యంగా నిర్మాతలు ఆలోచించిన విధంగానే రిపబ్లిక్ డే రోజు నుండి మన భారతదేశం లోని కోట్లాది మంది భారతీయులకు జాతి కుల మత వివక్షత లేకుండా ఈరోజు నుండే మనకు ప్రాధమిక హక్కులు లభించ బడ్డాయి. మన రాజ్యంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మరియు అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది అంటే మన రాజ్యంగ నిర్మాతలు ఎంత లోతుగా ఆలోచించి మన రాజ్యంగాన్ని రూపొందించారో అర్ధం అవుతుంది. ప్రతి గణతంత్ర దినోత్సవం రోజున మన సైనిక శక్తి సామర్ధ్యాలు ప్రపంచ దేశాలకు చాటే విధంగా జరుపబడే రిపబ్లిక్ డే పెరేడ్ ఈరోజు వివిధ రంగాలలో అద్వితీయమైన కృషి చేసిన మహోన్నత వ్యక్తిలకు ప్రకటించే పద్మ పురస్కారాల మధ్య ఆశేతుహిమాచలం లోని వాడవాడలా ఈరోజున రెపరెప లాడుతూ ఎగిరే మన మువ్వన్నెల జెండా కోట్లాదిమంది భారతీయులకు మన అఖండ భారత ప్రజాస్వామ్యం పై ఆశలు కలిగేలా మన భారత జాతి ఔన్యత్యం చాటుతూనే ఉంటుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: