ఎన్నికల ముందు పెట్టుకునే పొత్తులకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో రెండు రాజకీయ పార్టీలు జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. 2024లో జరిగే ఎన్నికల్లో ఇదే పొత్తుతో స్నేహంగా వెళ్తామని ఇరు పార్టీల నాయకులు ఇటివల ఢిల్లీలో ప్రకటించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడకు లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహిస్తామని పవన్ ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా ఓకే అంది.

 

 

అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడా లాంగ్ మార్చ్ కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు నాగభూషణం దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే.. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఇంతవరూ స్పందించలేదు. దీంతో ఇరుపార్టీల స్నేహంపై ఆదిలోనే అనుమానాలు మొదలయ్యాయి. జాతీయ పార్టీగా బీజేపీ తీసుకునే నిర్ణయాలకు, ప్రాంతీయ పార్టీగా పవన్ మాత్రమే తీసుకేనే నిర్ణయాలకు తేడా ఉంటుందనేది తెలిసిన విషయమే. ఈనేపథ్యంలో వీరిద్దరి పొత్తుపై మొదటి నుంచీ అనుమానాలున్నా ఎవరూ పెద్దగా స్పందించ లేదు. కానీ.. లాంగ్ మార్చ్ వంటి కార్యక్రమమే వాయిదా పడడం.. బీజేపీ మాత్రమే ప్రకటించడంతో అందరిలోనూ అనుమానాలు మొదలవుతున్నాయి.

 

 

నాలుగేళ్ళకు పైగా సమయం ఉన్న ఎన్నికల వరకూ ఒక మాట మీద రెండు పార్టీలు వెళ్తాయా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. వైసీపీ మూడు రాజధానుల అంశంపై బీజేపీ మద్దతు లేదని పవన్, రాష్ట్ర నాయకులు చెప్తున్నా జాతీయస్థాయి నాయకులు ఇంతవరకూ స్పందించలేదు. లాంగ్ మార్చ్ వాయిదా వేయడంతో.. కేంద్రంలో మూడు రాజధానుల ప్రతిపాదనకు అంగీకారం ఉందా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం.. లాంగ్ మార్చ్ వాయిదాపై పవన్ స్పందించడం.. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో బీజేపీ ప్రకటించడం రెండూ ప్రధానంగా మారాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: