మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మరో వివాదం మొదలైంది. నిరంతర వివాదాలతో వార్తల్లో ఉండే మాలో ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడిగా నరేశ్ ను తొలగించేస్తున్నారు. ఇందుకు అంతా సిద్దమైపోయిందట. త్వరలో ప్రకటన మాత్రమే మిగిలి ఉందని సినీ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. అంటే నివురు గప్పిన నిప్పు మరోసారి రాజుకోబోతోందన్నమాట.

 

మాలో ఎన్ని వివాదాలు, విబేధాలు ఉన్నాయో.. మొన్నటి ఓ కార్యక్రమంలో హీరో రాజశేఖర్ స్వయంగా చెప్పేశారు. పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతా లుకలకలే అని అందరి ముందు.. మీడియా ముందే రాజశేఖర్ స్పష్టం చేశారు. ఆరోజు ఆ సమావేశం చూసిన వారెవరైనా సరే.. మా లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో అర్థం చేసుకోగలరు.

 

మా అధ్యక్షుడు నరేశ్ కూ.. ఉపాధ్యక్షురాలు జీవితకు ఉన్న విభేదాల కారణంగానే ఆరోజు రాజశేఖర్ ఆ రేంజ్ లో అందరి ముందు ఫైర్ అయ్యారు. ఆ కార్యక్రమం తర్వాత వీరిద్దరికీ సయోధ్య కుదిర్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. కానీ అవేవీ ఫలించలేదని.. అంటున్నారు. దీనికి తోడు అధ్యక్షుడిగా నరేశ్ అంత చురుగ్గా ఉండకపోవడం.. అందరినీ కలుపుకుపోకుండా ఉండటం కూడా ఆయన ఉద్వాసనకు దారి తీస్తున్నట్టు తెలుస్తోంది. నరేశ్ ను పదవి నుంచి తప్పించడానికి మా ఈసీ క్రమ శిక్షణా సంఘానికి లేఖ కూడా రాసినట్టు సమాచారం. నరేశ్ యాక్టివ్ గా ఉండటం లేదు, అందర్నీ కలుపుకుపోడవం లేదని జీవిత వర్గం ఆరోపిస్తుంటే.. జీవిత తరచూ వివాదాలు సృష్టిస్తోందని నరేశ్ వర్గం ప్రత్యారోపణలు చేస్తోంది.

 

మొత్తానికి ఈ విభేదాలు నరేశ్ ఉద్వాసనకు దారి తీసినట్టు తెలుస్తోంది. పైగా నరేశ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. " నేను వచ్చిన ఆరు నెలల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేశాను. సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల అనుకున్నది చేయలేకపోయా. ‘మా’లో ఆదిపత్యపోరు, వివాదాలు ఉన్న మాట వాస్తవమే. నా టర్మ్‌లో సంవత్సరం పూర్తైంది. మరో సంవత్సరం ఉంది. ‘మా’ అధ్యక్ష పదవి నుంచి దిగిపోమ్మంటే ఈ క్షణమే దిగిపోడానికి సిధ్ధంగా ఉన్నాను.. అంటూ మాట్లాడటం కూడా పై అనుమానాలకు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: