ప్రభాస్ అప్పటివరకు అంతగా తెలియని పేరు కాని అనుకోకుండా తన పెద్దనాన్న చొరవవల్ల ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. వాస్తవంగా ఈ సినిమాను  జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో, హీరో తరుణ్‌తో చేద్దామనుకున్నారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాత అశోక్‌కుమార్‌ కొడుకుని పెట్టి తీద్దామని జయంత్‌ సలహా ఇవ్వగా, ఆ సమయంలో అశోక్‌ కుమార్‌ కొడుకు చదువుకుంటుండటంతో అందుకు ఒప్పుకోలేదు.

 

 

ఆ సమయంలో కొత్త హీరో కోసం వెతుకుతుండగా, ప్రభాస్ మీదికి దృష్టి మళ్లింది. అలా ఒక తల్లిలేని తల్లిలేని యువకుడు, అందులో దూల్ పేటలోని మురికివాడలో నివశిస్తుంటాడు అనే పాయింట్ తో పక్కాగా మాస్ యాంగిల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. అలా ఈ సినిమాతో మాస్ హీరో అనే చిన్న బిరుదు ప్రభాస్ ముందు వాలిపోయింది. ఆ తర్వాత ‘రాఘవేంద్ర’ సినిమా చేసిన ప్రభాస్‌ కు ఈ చిత్రం ఎలాంటి ఇమేజ్‌ను సొంతం చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను కొందరు ‘మాస్‌ హీరో’ అని అంటే ఒప్పుకోక తాను ‘లవర్‌బాయ్‌’ అనేవారట.

 

 

ఇక ఇదే సమయంలో శోభన్‌ దర్శకత్వంలో, ఎం.ఎస్‌.రాజు నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘వర్షం’.. మంచి కమర్షియల్ టచ్ తో, అటుమాస్ ప్రేక్షకులనే కాకుండా, ప్రేమికులను, క్లాస్ పీపుల్స్‌ను బేస్ చేసుకుని వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత  ‘అడవిరాముడు’, ‘చక్రం’ సినిమాలు అంతగా అలరించలేకపోయాయి. అప్పుడే మరో మాస్ ఇమేజ్‌తో రాజమౌళి దర్శకత్వంలో ‘ఛత్రపతి’ సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

 

 

తర్వాత ‘బుజ్జిగాడు’ ప్రభాస్‌ను కొత్తగా చూపించగా, ‘బిల్లా’లో స్టైలిష్‌గా కనిపించారు. ‘డార్లింగ్‌’ చిత్రంతో ప్రభాస్‌ అన్ని రకాల పాత్రలూ చేయగలరని నిరూపించడమే కాదు, లవర్‌బాయ్‌గా ప్రభాస్‌ పోషించిన పాత్ర యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘మిర్చి’ చిత్రాలు ప్రభాస్‌ కెరీర్‌ గ్రాఫ్‌ను మరింత పెంచాయి. ఈ మాస్ హీరోను క్లాస్ హీరోగా మార్చేసాయి.. ఇక ఇప్పుడు ప్రభాస్‌ను చూస్తుంటే ఒకప్పటి ఈశ్వర్‌కు ఇప్పటి సాహో కు ఎంతగానో వ్యత్యాసం కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: