'డబ్బిస్తే నడుచుకుంటు వస్తుంది నందీ అంటూ ఒకప్పుడు టాలీవుడ్ విలక్షణ నటుడు హీరో, నిర్మాత డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు సభా ముఖంగా ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. అంటే అర్హత ఉన్నవాళ్ళకే అవార్డులు ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశ్యం. కానీ చాలామంది అవార్డులు రావడం లేదని నానా రచ్చ చేస్తుంటారు గాని ..అందుకు మేము అర్హులమా కాదా అన్న విషయం మాత్రం ఆలోచించరు. ఇప్పుడిదే విషయంలో ఒక బాలీవుడ్ ఫేమస్ నటుడు పద్మశ్రీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటుడు అన్ను కపూర్. ఎన్నో ఏళ్లుగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్నప్పటికీ ఆయనకు ఇప్పటివరకు భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి గౌరవం దక్కలేదు. కనీసం ఈసారైనా 'పద్మశ్రీ' పురస్కారం వస్తుందేమో అనుకున్నారు. కానీ ఈసారి కూడా ఎందుకనో దక్కలేదు. పైగా పాకిస్థాన్‌లో పుట్టి భారత్ లో సెటిల్ అయ్యి, ఇక్కడి పౌరసత్వం దక్కించుకున్న సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీకి పురస్కారం దక్కించింది. అయితే ఇప్పటికే ఈ విషయంలో  దీనిపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఓ నెటిజన్ అన్ను కపూర్ గురించి సోషల్ మీడియాలో సెన్షేషనల్ కామెంట్స్ చేశాడు. ఆయనకు పురస్కారం ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. ‘సినిమాల్లో సుప్రసిద్ధులు అయిన గొప్ప హాస్యనటుడు, రేడియో హోస్ట్, ఎందరికో రోల్ మోడల్ అయిన అన్నూ కపూర్ పద్మ పురస్కారానికి అర్హులు కారా? దయచేసి అన్ను కపూర్ అభిమానులు ఆయనకు ఓటెయ్యండి’’ అని పోస్ట్ చేశాడు. ఇది చూసిన అన్ను కపూర్ ఈ పోస్ట్ గురించి స్పందించారు.

 

‘ధన్యవాదాలు. పద్మ పురస్కారాలు అర్హులకే వస్తాయి. నాలాంటి అనర్హుడికి కాదు. ఏదేమైనా మీలాంటి వారు గుర్తుచేసుకున్నారు. నాకు అదే చాలు’ అదే నాకు పద్మశ్రీ తో సమానం అని అభిప్రాయపడ్డారు. సాధారణంగా అన్ను కపూర్ ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ అసలే తనకు పద్మ పురస్కారం రాలేదని బాధలో ఉన్నారు అన్నూ. అదే సమయంలో నెటిజన్ ఈ ట్వీట్ చేయడం ఆయనని రెచ్చగొట్టినట్టే అయింది. అందుకే మనసులోని బాధను ఇన్‌డైరెక్ట్ గా బయట పెట్టారు. ఇక బాలీవుడ్ నటి కంగనా రనౌత్, నిర్మాతలు ఏక్తా కపూర్, కరణ్ జోహార్‌లకు కూడా పద్మశ్రీ వరించింది. అయితే ఎప్పుడో ఇవ్వాల్సిన పద్మశ్రీ అవార్డును కాస్త ఆలస్యంగా ఇచ్చినందుకు పలువురు సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంలో టాలీవుడ్ లో శతాది చిత్రాల దర్శకులు కీర్తి శేషులు కోడి రామకృష్ణ, అలాగే కైకాల సత్యనారాయణ గురించి ఇలాంటి కామెంటే వినిపించాయి. దీన్ని బట్టి చూస్తుంటే పద్మశ్రీ విషయంలో కొంతవరకు అన్యాయం జరుగుతుందన్న భావన వస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: