శంకరాభరణం 1979 లో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో నిర్మంచబడిన సంగీత ప్రాధాన్యత గల చిత్రం. కాలం ఎలా మారినా మనిషిలో మానవత్వం మాత్రం మారదు. ఈ విషయాన్నే సంగీత లయాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది పూర్ణోదయావారి శంకరాభరణం. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం 2020 ఫిబ్రవరి 2నాటికి 40 వసంతాలు పూర్తి చేసుకుంటుంది.  70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలిమలుపు అయ్యింది ఈ చిత్రం. అంతగా పేరులేని నటీ నటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం విశేషం. 

 

ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. శంకరశాస్త్రి (జె. వి. సోమయాజులు) గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వేశ్య కూతురు, గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్త్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకరశాస్త్రిని తులనాడిన విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. ఈ కేసు నుంచి ఆమెను బయటకు తీసుకురావడానికి శంకర శాస్త్రి అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో తులసిని విడిపిస్తాడు. వేశ్యకు ఆశ్రయం ఇచ్చారని శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూస్తారు. 

 

తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక పుత్రుడికి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర నేర్చుకోవడానికి అతన్ని నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును ఆయన సంగీతానికి వారసుడిగా నియమిస్తుంది. కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ఆమె కూడా ప్రాణాలువిడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: