తెలుగు సినిమా చరిత్రలో కళాత్మక దృశ్యకావ్యంగా సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన సినిమా శంకరాభరణం. ప్రపంచానికి మన తెలుగు సినిమా కీర్తిని శంకరాభరణం చాటిచెప్పింది. 40 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైన ఈ సినిమా నేటికీ సినీ అభిమానులను విపరీతంగా అకట్టుకుంటూ ఉండటం గమనార్హం. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రజలు శాస్త్రీయ సంగీతం పట్ల ఆకర్షితులు అయ్యేలా చేసింది. 
 
ఈ కాలంలో ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పాన్ ఇండియా అని సినిమాలకు చెప్పుకుంటున్నట్టే ఆ కాలంలో శంకరాభరణం సినిమాను బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా విజయం కేవలం తెలుగు రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో విడుదలై అన్నిచోట్లా ఘనవిజయం సాధించి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 
 
రెగ్యులర్ థియేటర్స్ లో అమెరికాలో విడుదలైన తొలి సినిమా శంకరాభరణం. ఎన్నో దేశాల్లో ఈ సినిమా విడుదలై విజయం సాధించటంతో పాటు తెలుగు సినిమా గౌరవాన్ని పెంచింది. ప్రతి తెలుగువాడు శంకరాభరణం మా సినిమా అని గర్వంగా చెప్పుకునేవారంటే ఈ సినిమా ప్రజలపై ఎంత ప్రభావం చూపిందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా విజయంలో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. 
 
కె వి మహదేవన్ ఈ సినిమాకు బ్రహ్మాండమైన పాటలను అందించాడు. ఈ సినిమా పాటలు ప్రజల నోళ్లలో నానుతూ ఉన్నాయంటే శంకరా భరణం స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అనేక జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా కలకాలం నిలిచిపోయే తెలుగు సినిమా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రముఖ అధ్యాత్మిక ప్రవచకులైన చాగంటి కోటేశ్వరరావు మూడు రోజులపాటు శంకరాభరణం సినిమాపై ప్రవచనాలు చెప్పారంటే ఈ సినిమా గొప్పదనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: