1980వ సంవత్సరంలో తెలుగు చలచిత్ర దిగ్గజ దర్శకుడు కె విశ్వనాధ్ గారు తీసిన శంకరాభరణం సినిమా గురించి ఇప్పటివారికి అంతగా తెలియకపోవచ్చును కానీ, అప్పట్లో ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. కేవలం తెలుగు వారు మాత్రమే కాక, పలు ఇతర భాషల వారు సైతం ఈ సినిమాని చూసి ఎంతో గొప్పగా ప్రశంసించడం విశేషం. ఇక ఎల్లలు దాటి పలు ఇతర భాషల్లో కూడా డబ్ అయి, సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమాను అప్పట్లో అమెరికా దేశంలో డైరెక్ట్ గా ప్రదర్శించగా విపరీతమైన పేరు, కలెక్షన్స్ దక్కాయి. 

 

నిజానికి ఇప్పుడు ఒకరి సినిమా పై మరొకరు పోటీ పడుతూ ఫేక్ కలెక్షన్స్ వేసుకున్న మాదిరి కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి అందరి నోటా ఎంతో గొప్పగా పేరు దక్కించుకున్న ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కె విశ్వనాధ్ గారు నిజంగా ధన్యులు అనే చెప్పాలి. ఇక శంకర శాస్త్రిగా సోమయాజులు గారి అద్భుత నటన సినిమాకు మరింత గొప్ప ప్రాధాన్యతను తీసుకువచ్చింది. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన ఆయన గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అప్పటి యువత పాశ్చాత్య సంగీతం పట్ల మోజుతో మన కళలను పద్దతులను మరిచిపోతుండడంతో శంకర శాస్త్రి, అటువంటి వారికి మన కళల యొక్క ప్రాధాన్యతను తెలియచెప్పే  సన్నివేశం ఎంతో బాగుంటుంది. 

 

నటి మంజు భార్గవితో పాటు అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, చంద్రమోహన్, బేబీ తులసి, రాజ్యలక్ష్మి తదితరులు ఈ సినిమాలో తమ సహజ నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. ఇక అప్పట్లో పలు కలెక్షన్స్ రికార్డులతో పాటు ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు కూడా గెలుచుకున్న ఈ అత్యద్భుత చిత్ర రాజాం రిలీజ్ అయి నేటికి 40 ఏళ్ళు గడిచాయి. అయినప్పటికీ ఆ సినిమా మన ప్రేక్షకుల్లో ఏర్పరిచిన తీపి గుర్తులను ఎప్పటికీ మరచిపోలేము అనే చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: