వక్కంతం వంశీ.. ఎన్టీఆర్ హీరోగా ఓ సబ్జెక్టు మీద కొన్ని నెలల పాటు పని చేసి ఆ సినిమాను ఓకే కూడా చేయించుకున్నాక అనుకోకుండా దానికి బ్రేక్ పడిపోయింది. అయినా నిరాశ చెందకుండా అల్లు అర్జున్‌ను ట్రై చేసి అతడితో ‘నా పేరు సూర్య’ లాంటి భారీ చిత్రం తీయగలిగాడు. కానీ ఏం ప్రయోజనం? ఆ చిత్రం డిజాస్టర్ అయింది. వంశీని కుదేలు చేసింది. ఆ దెబ్బ నుంచి అతను తర్వాత కోలుకోలేకపోయాడు.

వంశీ.. ఒక మూడేళ్ల ముందు వరకు స్టార్ రైటర్. ఇంకా చెప్పాలంటే అప్పటికి అతను టాలీవుడ్లో నంబర్ వన్ రైటర్ కూడా. త్రివిక్రమ్ శ్రీనివాస్, కోన వెంకట్ తర్వాత రచయితగా ఆ స్థాయిని అందుకున్నది వంశీనే. ఐతే రచయితగా ఉన్నంత కాలం అతడికి తిరుగులేదు. కానీ ఏ ముహూర్తాన దర్శకుడిగా మారాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడో కానీ.. అప్పట్నుంచి అతడికి కష్టాలు మొదలయ్యాయి.

వక్కంతం వంశీ, బన్నీ వాసు కలిసి త్రివిక్రమ్‌తో తనకు సినిమా సెట్ చేశారని.. వంశీ అయితే మీకెందుకు నేను చూసుకుంటా అంటూ త్రివిక్రమ్‌తో మాట్లాడి ఈ సినిమా ఓకే చేయించారని.. అందుకు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని బన్నీ తెలిపాడు. ఒకప్పుడు వంశీ కథల గురించి, డైలాగ్స్ గురించి.. అతడి రచనా పటిమ గురించి వేదికల మీద పొగిడేవాళ్లు. కానీ ఇప్పుడు ఒక సినిమాకు ఫెసిలిటేటర్ పాత్ర పోషించినందుకు పొగడ్తలు అందుకుంటుండటం చిత్రమే.

రచయితగా సినిమాలు మానేశాడు. దర్శకుడిగా అవకాశాలు రాలేదు. చివరికి గీతా ఆర్ట్స్ కాంపౌండ్లో స్క్రిప్ట్ అనలిస్ట్ పాత్రకు పరిమితం అయ్యాడు వంశీ. రెండేళ్లుగా గీతా కాంపౌండ్‌కే పరిమితం అయిన వంశీ.. అక్కడ తెరకెక్కే సినిమాల స్క్రిప్టుల్ని పర్యవేక్షిస్తున్నాడు. దీంతో పాటు బన్నీకి సినిమాలు సెట్ చేసే ఫెసిలిటేటర్ పాత్ర కూడా అతను పోషిస్తున్నాడని తాజాగా వెల్లడైంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం బన్నీ, త్రివిక్రమ్‌లను కలపడంలో వంశీ పాత్ర కీలకమట. ఈ విషయాన్ని ఈ చిత్ర లేటెస్ట్ థ్యాంక్స్ మీట్లో బన్నీ వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: