దిల్ రాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. "రీమేకుల విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ గా వుంటాను. ఎందుకంటే సదరు రీమేక్ సినిమాలు నా సహచర నిర్మాతలకు మేకుల్లా గుచ్చుకున్న సంగతి నాకు తెలుసు." అని తాను చేసిన రీమేక్ 96 గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. పదిహేనేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ రీమేక్‌ జోలికి వెళ్లలేదు. గతంలో మలయాళ చిత్రం ‘బెంగళూరు డేస్‌' తెలుగులో పునర్నిర్మించేందుకు హీరోలు నాని, శర్వానంద్‌లను ఒప్పించాను. మరో హీరో క్యారెక్టర్‌ కోసం సరైన నటుడు దొరక్కపోవడంతో సినిమాను చెడగొట్టడం ఇష్టం లేక పక్కనపెట్టాం. 

 

అలాగే ‘ప్రేమమ్‌' సినిమాను  రీమేక్‌ చేయాలనుకున్నాను. కానీ  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఆ ప్రయత్నం చేయడంతో కుదరలేదు. రీమేక్‌ సినిమాతోనే ఈ ఏడాది హిందీలో  నిర్మాతగా పరిచయం కాబోతున్నాను.  రీమేక్‌ కారణంగానే పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయాలనే నా కల నెరవేరనుంది. ఆ ఆలోచనతోనే రీమేక్‌ల విషయంలో రియలైజ్‌ అయ్యాను. మంచి సినిమాను చేయడం ముఖ్యమని అర్థంచేసుకున్నాను.  

 

ఈ ఏడాది మా సంస్థ ద్వారా ‘జాను’తో పాటు ‘జెర్సీ’ హిందీ రీమేక్‌, ‘పింక్‌' తెలుగు రీమేక్‌లను             నిర్మిస్తున్నాను. సినిమా చూసినప్పుడు మిస్‌ అవ్వకుండా రీమేక్‌ చేయాలనే ఫీలింగ్‌ కలగాలి.  ఈ సినిమాకు అదే అనుభూతి ఎదురైంది. తమిళ చిత్రం ‘96’ టీజర్‌ చూడగానే నాలో ఆసక్తిమొదలైంది.  నెల్లూరు డిస్ట్రిబ్యూటర్‌ హరి ద్వారా  మాతృక నిర్మాతను కలిసి సినిమా చూశాను. తమిళం రాకపోయినా కథ, పాత్రలతో సహానుభూతి చెందాను. ప్రతి సీన్‌ను ఎంజాయ్‌ చేశాను.

 

సినిమా  చూసిన వెంటనే తెలుగులో నేను రీమేక్‌ చేస్తానని తమిళ నిర్మాతతో అన్నాను. అతడు అడిగిన దానికంటే పదిహేనులక్షలు ఎక్కువగా ఇచ్చి హక్కులు తీసుకున్నాను. అంతగా నా హృదయానికి ఈ సినిమా నచ్చింది. ఇక నా జీవితంలో  ఎలాంటి  ప్రేమకథలు లేవు.  ప్రేమ, స్నేహం, రీయూనియన్‌ అంశాలతో హృద్యంగా సాగుతుంది. సినిమా చూసినవారందరికీ తమ స్కూల్‌, కాలేజీ రోజుల నాటి జ్ఞాపకాల్ని గుర్తుకుతెస్తుంది.. అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: