విశాఖ సినీ రాజధాని అని చెప్పుకోవడానికైతే చెపుకుంటారు. కానీ కనీసం విశాఖ ని చూస్తూ కూడా అక్కడౌన్న వాటిని ఇండస్ట్రీకి తగ్గట్టు తయారు చేయాలన్న ఆలోచనే ఎవరికీ కలగడం లేదు. మరోవైపు విశాఖలో ఎకరాలకి ఎకరాలు భూములు కొనుక్కోవడం అయితే తెలుసు కానీ ఇక్కడకు వచ్చి స్టుడియోలు కట్టి చిత్ర పరిశ్రమను పెట్టాలంటే మాత్రం సినీ పెద్దలకు అసలు మనసు రావడం లేదు ఆ ఇష్టమూ కలగడం లేదు. ఎటు తిరిగి జనాలని మాత్రం పిచ్చి వాళ్ళని చేస్తున్నారు.

 

విశాఖలో షూటింగులు ఎక్కువగా జరుగుతాయి. అలా ఇవాళా నిన్నా కాదు, 1960 నుంచి చూస్తున్నదే. స్వర్ణయుగం నటుడు అక్కినేని నాగేశ్వరరావు కులగోత్రాలు సినిమాతో విశాఖ అందాలు వెండితెరను పంచుకున్నాయి. ఆ తరువాత ఎంతో మంది మేకర్స్ విశాఖ అందాలతో కోట్లు సంపాదించుకున్నారు. 1990 లో చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవుతుందన్నపుడు కూడా విశాఖ పేరే గట్టిగా వినిపించింది. అయితే హైదరాబాద్ కే తరలించారు. అయితే తెలుగు రాష్ట్రాల విభజన తరువాత మళ్ళీ విశాఖకు టాలీవుడ్ షిఫ్ట్ అవుతుంది అంటూ జోరుగా ప్రచారం సాగినా పెద్ద పెద్ద నిర్మాతలు, పెద్దలు హైదరాబాదే..హైదరాబాదే అంటూ నీళ్ళు నమిలారు.

 

ఇపుడు విశాఖకు రాజధాని అంటూంటే కొందరు సినీ పెద్దలు సరే సరే అంటే... మరి కొందరు అలా వస్తే తమ భూములకు రేట్లు పెరుగుతాయని ఆశపడుతున్నారు. అంతే తప్ప విశాఖలో స్టూడియోలు కట్టి షూటింగులు పెట్టి స్థానికులకు ఉపాధిని ఇవ్వాలన్న ఆలోచన మాత్రం ఎవరికీలేదు. అంతా స్వలాభం చూసుకునే వాళ్ళే కనిపిస్తున్నారు. తప్ప జనాల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. విశాఖలో సినిమా ఫంక్షన్లు ఎక్కువగానే జరుగుతాయి. ఇలా ఫంక్షన్లు జరిగిన ప్రతీసారీ విశాఖకు చిత్ర పరిశ్రమను తెస్తున్నామని సినీ పెద్దలు వెల్లడిస్తున్నారు. కాని ఆ మాట అప్పటి వరకే. తెలారాక మళ్ళీ మామూలే. మరి ఎందుకిలా విశాఖ విషయంలో నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారో అర్థం కావటం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: