సంక్రాంతి సీజన్‌లో పోటీపడ్డ మహేశ్, అల్లు అర్జున్ ఇద్దరూ సూపర్ హిట్స్ తో విజేతలుగా నిలిచారు. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ మహేశ్ కెరీర్‌లో, ‘అల వైకుంఠపురములో’ సినిమా బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి సంక్రాంతి తర్వాత వచ్చే పెద్ద సీజన్ సమ్మర్ అన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో టాప్ హీరోల సినిమాలు వచ్చే అవకాశాలు లేవనీ ప్రేక్షకులూ నిరాశ చెందే లోపే వాళ్ళ ఆశలని నిజం చేస్తూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సమ్మర్ కి తన సినిమాతో వస్తున్నాడు. ఆయన లాయర్‌గా నటిస్తోన్న ‘పింక్’ రీమేక్ మే 15న విడుదల చేస్తున్నామని ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించాడు. ఈ సినిమా కోసం ఫిల్మ్ చాంబర్‌లో ‘వకీల్ సాబ్’ 'లాయర్ సాబ్' అనే టైటిల్ రిజిస్టర్ చేయించినప్పటికీ అధికారికంగా ఇంకా ఏదీ ప్రకటించలేదు. అయితే ఉగాది సందర్భంగా మార్చి 25న ఈ టైటిల్‌ను ప్రకటించనున్నారు.

 

కాగా మే 15న పవర్ స్టార్ సినిమా వస్తుందనే వార్త ఆయన ఫ్యాన్స్‌తో పాటు సగటు సినిమా ప్రియుల్నీ ఆనందంలో ముంచెత్తింది. మార్చి నుంచి మే వరకు వేసవి సీజన్ అనుకుంటే.. నాని (వి), నాగచైతన్య (లవ్ స్టోరీ), రాజ్ తరుణ్ (ఒరేయ్ బుజ్జిగా), రామ్ (రెడ్), శర్వానంద్ (శ్రీకారం), సాయితేజ్ (సోలో బ్రతుకే సో బెటర్), రవితేజ (క్రాక్) వంటి హీరోల సినిమాలు, అనుష్క (నిశ్శబ్దం) వంటి హీరోయిన్ సినిమాలు ఈ సీజన్‌లో వస్తున్నాయి. 

 

 చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్  ఈ సమ్మర్ కి రావడం లేదు. ఈ నేపథ్యంలో సమ్మర్ లో మాంచి వసూళ్ళు దక్కించుకోవడానికి పవర్‌స్టార్ రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ సినిమాకు అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సెక్సువల్ హెరాస్‌మెంట్‌కు గురైన ముగ్గురు యువతుల తరపున కోర్టులో వాదించే లాయర్ క్యారెక్టర్లో పవన్ నటిసున్న సంగతి తెలిసిందే.

 

ఇక హిందీ ఒరిజినల్‌ సినిమాతో చూస్తే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా చాలా మార్పులతో ఈ సినిమాని శ్రీరామ్ వేణు రూపొందిస్తున్నాడట. ‘పింక్’ సినిమాలో అమితాబ్ ఫైట్లు చెయ్యరు. కానీ తెలుగు వెర్షన్‌లో పవన్ కల్యాణ్ ఫైట్లు చేస్తున్నాడట. ఇప్పటికే వారం రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్న పవన్ మార్చిలోగా మరో రెండు వారాలు ఈ సినిమా కోసం కేటాయించి, తనకి సంబంధిన సీన్స్ అన్ని పూర్తి చేయనున్నారు. ఇక పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: