నందమూరి బాలకృష్ణ హీరోగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది చిత్రం `రూలర్`. హీరోగా బాలయ్యకు 105వ సినిమా. బాలకృష్ణ సరసన సోనాలి చౌహన్, వేదిక నటిస్తుండగా, భూమిక చావ్లా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్తగా యంగ్ లుక్ లో దర్శనమివ్వనున్నాడు. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమా అప్డేట్స్ విడుదలకు ముందే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. కానీ విడుదల తర్వాత ఆ హైప్ ఒక్క రోజు కూడా నిలవలేదు.
బాలయ్య గత రెండు చిత్రాలు ఎన్టీఆర్ బయోపిక్ నిరాశ పరచడంతో ‘రూలర్’ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. కాని, ఈ చిత్రం కూడా బాలయ్య అభిమానులను నిరాశ పరిచిందని చెప్పాలి. సోనాల్ చౌహాన్, వేదిక అందాల ఆరబోత కూడా రూలర్ సినిమాను కాపాడలేకపోయింది. బాలయ్యను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు కేయస్ రవికుమార్. ఈ క్రమంలోనే హాలీవుడ్ ఫేమస్ రోల్ ఐరన్ మ్యాన్ టైప్ గడ్డం కటింగ్ లో వచ్చిన బాలయ్య లుక్స్ ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలుసు.
కానీ ఊహించని రీతిలో ఈ చిత్రం కూడా ఘోరమైన పరాజయం పాలయ్యింది. దీంతో బాలయ్య నటించిన బ్యాక్ టు బ్యాక్ మూడు చిత్రాలు కూడా హ్యాట్రిక్ గా డిజాస్టర్ అయ్యిపోయాయి. అయితే గత డిసెంబర్ 20న విడుదలైన ఈ రూలర్ చిత్రం అప్పుడే టెలివిజన్ తెరపై టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఫిబ్రవరి 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ జెమినీ టీవిలో ప్రసారం చెయ్యనున్నారు. మరి వెండితెరపై ఘోరమైన డిజాస్టర్ గా నిలిచిపోయిన ఈ చిత్రం బుల్లితెరపై ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.