వచ్చే సంక్రాంతి సినిమా సందడి ఏడాది ముందే ప్రారంభమైపోయింది. రాజమౌళి తీస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ 2021 జనవరి 8న విడుదల అని ప్రకటించేశారు మరి. సాధారణంగా ఈ పండగకు సినిమాల విడుదల ప్లాన్ చేసుకోవడంలోనే పోటీ ఉంటుంది. మరి 2021 సంక్రాంతికి పోటీ పడే హీరోలెవరో చెప్పలేం కానీ.. ఓ ఆసక్తికరమైన పోటీ మాత్రం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారతీయ సినిమాలో దిగ్దర్శకులు అనదగ్గ ఇద్దరి మధ్య ఈ పోటీ నెలకొనే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

 

బాహుబలితో దేశంలోనే పెను సంచలనం సృష్టించిన రాజమౌళి ఒకరైతే.. రెండు దశాబ్దాల నుంచీ తన కథలతో, సాంకేతికతో ఇండియన్ సినిమాపై చెరగని ముద్ర వేసిన తమిళ దర్శకుడు శంకర్ మరొకరు. శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా భారతీయుడు-2 సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా సంగతి సరేసరి. ఇద్దరూ తమ సినిమాలను అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, అన్ని జాగ్రత్తలతో తీసేవారే. ఎంత సమయమైనా ఔట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ కానీ ఈ ఇద్దరు దర్శకుల సినిమాలు సంక్రాంతి పుంజులవుతాయనే వార్తలు షికారు చేస్తున్నాయి.

 

 

బాహుబలి తర్వాతి సినిమా కావడం, రాజమౌళి క్రేజ్ పీక్స్ ఓ ఉండటం, ఇద్దరు సమఉజ్జీలైన స్టార్ హీరోలు కావడంతో ఆర్ఆర్ఆర్ పై దేశం మొత్తం అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక శంకర్ భారతీయుడు2 కి వస్తే.. 24ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు అప్పట్లో సంచలనాలు సృష్టించింది. వీరిద్దరి మధ్య పోటీ, బ్రిలియన్స్ టెస్ట్ ఆసక్తి రేపడం ఖాయం. అయితే.. భారతీయుడు2 విడుదలపై క్లారిటీ రావాల్సి ఉంది. అదే జరిగితే.. హీరోల మధ్య జరగాల్సిన ఆధిపత్య పోరు ఈసారి దర్శకుల మధ్య జరుగుతుందనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: