అధికార  బీజేపీ చేతిలో సూపర్ స్టార్ రజనీకాంత్ కీలు బొమ్మగా మారిపోయాడని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అళగిరి మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం రజనీకాంత్‌ పై విమర్శలు గుప్పించారు. పౌరసత్వం చట్టానికి మద్దతుగా నటుడు రజనీకాంత్ మద్దతు చేస్తూ ఒక ప్రకటన చేశారు. దీంతో ఆయనకి వరుస కౌంటర్లు పేలుతున్నాయి. సీఏఏ, ఎన్‌పీఆర్‌ గురించి ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయ‍న్న రజనీకాంత్‌ వ్యాఖ్యలను పలువురు నేతలు ఖండించారు. 

 

అలాగే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి  పీ చిదంబరం రజనీకాంత్‌ వ్యాఖ్యల పై నిరాశ వ్యక్తం చేశారు. సీఏఏ ఎందుకు వివక్ష పూరితమైందో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎలా అవుతుందో రజనీకాంత్‌ కి వివరించేవాడినని ఆయన ట్వీట్ చేశారు. అటు కాంగ్రెస్‌ నేత, ఎంపీ కార్తీచిదంబరం కూడా రజనీకాంత్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు రజనీ నటించాల్సిన అవసరం లేదని కార్తీ ఎద్దేవా చేశారు. ఆయన బీజేపీలో చేరవచ్చని పేర్కొన్నారు.  సీఏఏ అమల్లోకి వస్తే 17 కోట్ల మంది ముస్లింలు, మూడు కోట్ల మంది క్రైస్తవులతో పాటు 83 కోట్ల మంది హిందువులు కూడా ప్రభావితమవుతారన్నారు.

 

అస్సాంలో 19 లక్షల మంది పౌరులను విదేశీయులుగా ప్రకటించారు. ఈ జాబితాలో ముస్లింలు,  హిందువులు ఉన్నారనే సంగతి రజనీకాంత్‌ కు తెలుసా అని అళగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోంలో మాదిరిగా దేశవ్యాప్తంగా నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలను కుంటున్నారా..? అని ప్రశ్నించారు. రజనీకాంత్ తమిళనాడులో మతపరమైన ఎజెండాను భుజానకెత్తుకున్నారని స్పష్టమైందనీ,  రజనీ అసలు రాజకీయాలు.. ఇప్పుడు బహిర్గతమయ్యాయని విమర్శించారు.

 

మతం ప్రాతిపదికన పౌరుల పై వివక్ష చూపలేమని రాజ్యాంగం చాలా స్పష్టంగా పేర్కొందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. బీజేపీకి రజనీకాంత్‌ మద్దతు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు.. కానీ వాస్తవాలను మరుగుపరచకూడదన్నారు. జనాభా గణన, ఎన్‌పీఆర్‌ వేర్వేరు అనే విషయాన్ని ఆయన మొదట అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: