వరుణ్, దివ్యా రావు హీరో హీరోయిన్లుగా టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న చిత్రం `డిగ్రీ కాలేజ్`. ఈ సినిమాకి దర్శకత్వం నరసింహా నంది వహించారు మరియు  శ్రీ లక్ష్మీ నరసింహా సినిమా అండ్ టీమ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సునీల్ కశ్యప్ అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలకాబోతోన్న సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఇదిలా ఉంటే.. డిగ్రీ కాలేజ్ సినిమా పోస్టర్లు హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతున్నాయి. సినిమా మొత్తం బోల్డ్ కంటెంట్ కావడంతో ఇప్పుడు ఆ సినిమా పోస్టర్లై సైతం కొంద‌రు విరుచుకు ప‌డుతున్నారు. 

 

తాజాగా  అమీర్‌పేట మైత్రివనమ్‌ కూడలిలో డిగ్రీ కాలేజ్‌ సినిమాకు చెందిన అశ్లీల పోస్టర్లు అతికించినందుకు సినిమా దర్శకుడు, నిర్మాతలపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా న‌డిరోడ్డుపై బుద్ధిలేకుండా యువ‌జంట‌ పోస్ట‌ర్లు వేయ‌డంతో మహిళలు, విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే మ‌రోవైపు డిగ్రీ కాలేజ్‌ సినిమా పోస్టర్లు అశ్లీల సన్నివేశాలతో అసభ్యంగా ఉన్నాయని, యువతను చెడుమార్గంలో తీసుకువెళ్లేలా పోస్టర్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విద్యార్థి, యువజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. డిగ్రీ కాలేజీ సినిమాలో ఉన్న అశ్లీల దృశ్యాలను వెంటనే తొలగించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

దీంతో టాస్క్‌ఫోర్సు పోలీసులు నినిమా దర్శకుడు నర్సింహ నంది, నిర్మాత శ్రీనివాస్‌రావులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.ఈ కేసును సుమోటోగా నమోదు చేసుకున్న ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కాగా, నరసింహ నంది ఇదివరకు ‘హైస్కూల్‌’, ’కమలతో నా ప్రయాణం’ , ‘లజ్జ’ సినిమాలు తీశారు. ‘1940లో ఒక గ్రామం’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును కూడా అందుకున్నారు. అయితే తన పంధాకు భిన్నంగా రొమాన్స్ అంశాలను మేళవించి ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. దీంతో వివాదాల‌కు తెర లేచాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: