దర్బార్ మూవీ డైరక్టర్ మురుగదాస్ తనకు రక్షణ కల్పించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. దర్బార్ నష్టాలకు డిస్ట్రిబ్యూటర్లు తనను బాధ్యుడిగా చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు దర్బార్ కారణంగా తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. 

 

ఏఆర్ మురుగదాస్, రజనీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన దర్బార్ సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని తీసుకురాలేదు. ఈ సినిమా వల్ల తాము నష్టపోయామని కొందరు డిస్ట్రిబ్యూటర్లు బహిరంగంగానే ప్రకటించారు. రజినినీ కలిసి దర్బార్ సినిమా నష్టాలను గురించి వివరించాలనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు నిరాశే మిగిలింది. గత వారంలో చెన్నైలోని రజినీ నివాసానికి వెళ్లి కలిసేందుకు డిస్ట్రిబ్యూటర్లు యత్నించగా.. వారిని అనుమతి లభించలేదు.

 

దర్శకుడు మురుగదాస్‌ను కలవాలని డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నించినప్పటికీ ఇదే పరిస్థితి ఎదురుకావడంతో ఇక లాభం లేదనుకున్న న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న నిర్ణయానికొచ్చారు. అయితే.. ఈ వివాదంలో రజినీకాంత్‌కు, దర్శకుడు మురుగదాస్‌కు రజినీ అభిమానులు మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దర్బార్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలనే తెచ్చిపెట్టిందని, లాభాలు రాకుండానే డిస్ట్రిబ్యూటర్లలో కొందరు సినిమా విడుదలైన నాలుగు రోజుల తర్వాత రజినీతో కలిసి నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారా.. అని సోషల్ మీడియాలో రజినీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గతంలో నష్టాలు వచ్చినప్పుడు ఓసారి రజనీ డిస్ట్రిబ్యూటర్లను వదులుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వరుసగా డిజాస్టర్లు రావడంతో.. రజనీ వీటిని భరించే పరిస్థతిలో లేరనే వాదన వినిపిస్తోంది. ఈ తరుణంలో డిస్ట్రిబ్యూటర్లు ఉద్దేశపూర్వకంగా గొడవ చేస్తున్నారని రజనీ అభిమానుల అభిప్రాయం. 

 

దర్బార్ సినిమా డిస్ట్రిబ్యూటర్ల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. నష్టాలకు తనను బాధ్యుడిని చేస్తూ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మురుగదాస్ పేర్కొన్నాడు. తనకు డిస్ట్రిబ్యూటర్ల వల్ల హాని ఉందని, రక్షణ కల్పించాలని కోర్టుకు విన్నవించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: