సమంత, శర్వానంద్ జంటగా నటించిన 'జాను' సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వడంతో యుఎస్ లో ప్రీమియర్ షో చూసిన వారు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. జాను చిత్రం తమిళంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ '96' రీమేక్ అని మనందరికీ తెలుసు. మామూలుగా అయితే ఏ భాష సినిమాని మన తెలుగులో రీమేక్ చేసినా... దర్శకులు మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చేస్తుంటారు. కానీ జాను చిత్రాన్ని 96 సినిమా లాగానే యాజ్ ఇట్ ఈజ్ గా దింపేసాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. 96 మూవీలో ఉన్న అద్భుతమైన ఫీల్ ను ఏ మాత్రం తగ్గించకుండా ఉండేందుకు డైరెక్టర్ ఈ విధంగా చేశాడని మనం చెప్పుకోవచ్చు.


వాస్తవానికి తమిళంలో 96 సినిమాని తెరకెక్కించిన దర్శకుడే తెలుగులో జాను చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. 96 చిత్రానికి సంగీతమందించిన గోవింద వసంతనే జాను సినిమాకి కూడా సంగీతాన్ని సమకూర్చారు. సో, జాను చిత్రాన్ని 96 యొక్క కార్బన్ కాపీ లాగా తెలుగు ప్రేక్షకుల కోసం తెరకెక్కించారని అనుకోవచ్చు. ఏదేమైనా జాను, రాము పాత్రలను పోషించిన సమంత, శర్వానంద్ ప్రేక్షకులను కట్టిపడేశారని టాక్ వినిపిస్తుంది.

 

అలాగే ఫ్లాష్ బ్యాక్ లో స్కూల్ ఎపిసోడ్ అద్భుతంగా ఉందని నెటిజనులు చెబుతున్నారు. చిన్ననాటి రాము, జాను పాత్రలను పోషించిన ఇద్దరూ ఎక్సలెంట్ గా నటించారని చాలామంది కొనియాడుతున్నారు. సినిమా కాస్త స్లో గా ఉన్నప్పటికీ... మ్యూజిక్ పరంగా, స్వచ్ఛమైన ప్రేమ కథ పరంగా గొప్పగా ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా చూస్తే స్వచ్ఛమైన ప్రేమ ఏంటో నేటి యువత కి తెలుస్తుందని పెద్దవారు కూడా సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: